
- నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి
- ప్రత్యేక ఫార్మాట్‌లో అప్లికేషన్లు
- భూ భారతి చట్టంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు: మంత్రి పొంగులేటి
- భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో గురువారం నుంచి సదస్సుల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా గ్రామాల్లో రైతులకు ఎలాంటి భూ సమస్య ఉన్నా.. ప్రత్యేక ఫార్మాట్‌లో ఆఫ్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు.
అప్లికేషన్ తీసుకున్న తర్వాత రైతులకు రశీదులు కూడా అందజేస్తారు. భూ భారతి పోర్టల్ద్వారా ఈ సమస్యలను పరిష్కరిస్తారు. పోర్టల్ద్వారా పరిష్కారం కాని సమస్యలున్నా, పోర్టల్‌లో సమస్యలు ఎదురైనా రాష్ట్రస్థాయిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. కాగా, ఏయే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారో ఒక రోజు ముందుగానే గ్రామస్తులకు తెలియజేసి, దరఖాస్తులను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం కాజాపురం గ్రామంలో భూభారతి పైలెట్ ప్రాజెక్ట్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
భూ భారతిపై అవగాహన కల్పిస్తం: మంత్రి పొంగులేటి
భూ భారతి చట్టం, పోర్టల్‌పై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చామని వివరించారు. ఈ ప్రతిష్టాత్మకమైన భూ భారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరినప్పుడే దానికి సార్థకత ఏర్పడుతుందని చెప్పారు. బుధవారం సెక్రటేరియెట్‌లో భూ భారతి అవగాహన సదస్సులపై మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేశామన్నారు. అలాగే, భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ అమలు చేసే 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
మద్దూర్ మండలం తర్వాత.. వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామంలో జరిగే సదస్సులో తాను పాల్గొంటానని మంత్రి తెలిపారు. 18న ములుగు జిల్లా వెంకటాపురంలో ఉదయం జరిగే రెవెన్యూ సదస్సులోనూ, తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో జరిగే సదస్సులోనూ పాల్గొంటానని వెల్లడించారు.‘‘4 మండలాల్లో అధికారులు భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటికి రశీదులను అందజేస్తారు. ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయి? ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి ? వాటి ఏ విధంగా పరిష్కరించాలి ? రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన చర్యలు, భూభారతి పోర్టల్‌పై ప్రజా స్పందనను చూసి భవిష్యత్తులో ఏవిధంగా ముందుకు వెళ్లాలి? అనే విషయంపై చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు.
ప్రతి దరఖాస్తునూ పరిష్కరిస్తం
కోర్టు పరిధిలో ఉన్న భూములు మినహా ప్రతి దరఖాస్తును మే 1 నుంచి పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఏ రోజుకారోజు కంప్యూటర్ లో నమోదు చేసి, సంబంధిత అధికారులకు పంపిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులకు సంబంధించి కలెక్టర్లు ప్రతిరోజూ ప్రతి మండలంలో రెండు కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
మండల కేంద్రాల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ తదితర అధికారులతో బృందాలుగా ఏర్పడి సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులు పూర్తయిన తర్వాత ఆ 4 మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో అప్లికేషన్లు తీసుకునేలా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
అప్లికేషన్ ఫార్మాట్ ఇలా..
రెవెన్యూ సదస్సుల్లో ఇవ్వబోయే అప్లికేషన్లలో అప్లికేషన్ నెంబర్ తోపాటు జిల్లా, డివిజన్, మండలం, గ్రామం పేరు, భూమి యజమాని వివరాలకు ప్రత్యేక కాలమ్స్ ఉన్నాయి. వీటితోపాటు కులం, ఆధార్ నంబర్, కొత్త, పాత పాస్‌బుక్స్ నంబర్లు, చిరునమా లాంటి వివరాలు తీసుకుంటారు. ఇక భూమి సమస్యల కాలమ్‌లో సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్, భూ విస్తీర్ణం, భూమి స్వభావం, భూమి సంక్రమించిన విధానం, ఏ విధమైన సమస్య? తోపాటు సమస్యను వివరించేందుకు ప్రత్యేక కాలమ్ ఇచ్చారు. ఒకవేళ భూ భారతి పోర్టల్‌లో (గతంలో ధరణిలో అప్లై చేసుకున్న అప్లికేషన్) నంబర్ ఉంటే ఆ వివరాలు కూడా తీసుకుంటారు.