భువనగిరి పబ్లిక్కు అలర్ట్.. ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటల వరకూ ఆంక్షలు

భువనగిరి పబ్లిక్కు అలర్ట్.. ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటల వరకూ ఆంక్షలు

యాదాద్రి భువనగిరి జిల్లా: ఫిబ్రవరి 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ పరిధిలో ఆంక్షలు విధించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిమిత్తం వినియోగిస్తున్న విద్యాసంస్థలు, కార్యాలయాలకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇప్పటికే స్థానిక సెలవు ప్రకటించారు.

నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 37 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఈ కేంద్రాల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు 27న స్థానికంగా సెలవిచ్చేశారు. 19 మంది అభ్యర్థులు పోటీల్లో ఉండడంతో ఓటర్లు చీలిపోకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే డబ్బు ఆశ చూపిస్తున్నారు. అవసరమైతే ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు కూడా వెనకాడటం లేదు.

భువనగిరి జోన్ పరిధిలో విధించిన ఆంక్షల వివరాలు:

• ఫిబ్రవరి 25 సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు డ్రై డే

• మద్యం షాపులు,బార్& రెస్టారెంట్లు, సిట్టింగ్ పర్మిటెడ్ హోటల్స్, క్లబ్బులు బంద్

• తెలంగాణ ఎక్సైజ్ చట్టం-1968, సెక్షన్ 20, ప్రకారం కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఆదేశాలు

• ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నంతవరకు బహిరంగంగా మత సామరస్యానికి భంగం వాటిల్లే విధంగా ఉపన్యాసాలు, ప్రచారాలు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు

• పోలింగ్ రోజు 27వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద BNSS సెక్షన్ 163 అమలు

• పోలీస్ అధికారులు, సిబ్బంది పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం