గ్రామీణ క్రికెటర్లను పట్టించుకోరా?

గ్రామీణ క్రికెటర్లను పట్టించుకోరా?
  • హెచ్‌‌‌‌సీఏ అండర్‌‌‌‌‌‌‌‌19 ప్రాబబుల్స్‌‌‌‌లో జిల్లాల క్రికెటర్లు ఇద్దరికే అవకాశమా? 
  • ప్రాబబుల్స్ మ్యాచ్‌‌‌‌లను అడ్డుకున్న జిల్లా క్రికెట్‌‌‌‌ సంఘాల ప్రతినిధులు  

హైదరాబాద్, వెలుగు: జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రికెటర్లపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌‌‌సీఏ) వివక్ష చూపుతోందని ఆ సంఘం జిల్లా ప్రతినిధులు ఆరోపించారు.  వినూ మన్కడ్‌‌‌‌ ట్రోఫీ అండర్ 19 ప్రాబబుల్స్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌ కోసం జట్ల ఎంపికలో జిల్లా క్రికెటర్లకు తీవ్ర అన్యాయం చేశారని  ఆవేదన వ్యక్తం చేశారు.  దీన్ని నిరసిస్తూ సోమవారం అజీజ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో మొదలైన ప్రాబబుల్స్ మ్యాచ్‌‌‌‌ను ఏడు ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రతినిధులు అడ్డుకున్నారు. తమ జిల్లాల క్రికెటర్లకు అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ‘క్రికెటర్ల ప్రతిభను గుర్తించి, వారికి తగిన అవకాశాలు ఇచ్చి రాష్ట్రం, దేశానికి ఆడించేలా ప్రోత్సహించడమే క్రీడా సంఘాల పని. కానీ, మన రాష్ట్రంలో  గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు ఆడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. 

ప్రాబబుల్స్‌‌‌‌ కోసం ఆరు జట్లలో 78 క్రికెటర్లను ఎంపిక చేస్తే కేవలం ఇద్దరు జిల్లా ప్లేయర్లకే  చాన్స్‌‌‌‌ ఇచ్చి సిటీకి చెందిన క్లబ్ క్రికెటర్లతో వాటిని నింపేశారు. ఇది చాలా అన్యాయం. గతంలో ఈ పోటీలో ఉమ్మడి జిల్లాల జట్టు ఉండేది. దాన్ని తొలగించడంతో పాటు జిల్లా క్రికెట్ల ప్రతిభను పరిగణనలోకి తీసుకోకుండా జట్లను ఎంపిక చేశారు. ప్రాబబుల్స్‌‌‌‌లో జిల్లాల నుంచి కనీసం 10–20 మందికి అయినా అవకాశం ఇస్తే వాళ్లు తమ ప్రతిభ నిరూపించుకుంటారు’ అని కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం ప్రెసిడెంట్  వి. ఆగం రావు పేర్కొన్నారు. జిల్లా క్రికెటర్లకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ నిరసనలో ఉమ్మడి అదిలాబాద్, ఖమ్మం, వరంగల్,మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, ‌‌‌‌మెదక్, నిజామాబాద్ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.