కేయూలో పరిశోధనలకు తాళం.. 9 నెలలుగా తెరుచుకోని కే హబ్​

కేయూలో పరిశోధనలకు తాళం.. 9 నెలలుగా తెరుచుకోని కే హబ్​
  • ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ ల కోసం  రూ.50 కోట్లు రిలీజ్
  • మార్చి నెలలో ప్రారంభించిన మంత్రులు
  • అందుబాటులోకి రాక పరిశోధనలకు దూరం

హనుమకొండ, వెలుగు: విద్యార్థులను పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణల వైపు నడిపించేందుకు కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ‘కే -హబ్’ తెరచుకోవడం లేదు. రాష్ట్ర మంత్రులు ఓపెన్​ చేసి నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు వినియోగంలోకి రావడం లేదు. రీసెర్చ్​ లకు అవసరమైన పక్కా బిల్డింగ్, ఇన్​ ఫ్రాస్ట్రక్చర్, ఇతర ఎక్విప్​మెంట్​ కోసం ఫండ్స్​ కూడా రెడీగా ఉన్నా ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా పరిశోధనల వైపు అడుగులు పడడం లేదు. దీంతో రూ.కోట్లు ఖర్చు పెట్టి కేయూ క్యాంపస్​ లో నిర్మించిన కే -హబ్​ అలంకారప్రాయంగా మారింది.

రూసా నుంచి రూ.50 కోట్లు..
రాష్ట్రంలో రెండో అతిపెద్ద యూనివర్సిటీగా పేరున్న కాకతీయలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్​ శిక్షా అభియాన్(రూసా) కింద 2018లో కే -హబ్​ను మంజూరు చేసింది. రీసెర్చ్, ఇన్నోవేషన్, క్వాలిటీ ఇంప్రూవ్​మెంట్​ కోసం కే హబ్​ నిర్మాణానికి దాదాపు రూ.50 కోట్లు మంజూరు​చేసింది. ఈ నిధులతో కే హబ్​కు పక్కా బిల్డింగ్​ తో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన రీసెర్చ్​ సెంటర్స్, ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది.

ఈ మేరకు 60: 40 ఫండింగ్​ తో డెవలప్​ చేయనున్న కే -హబ్​ కోసం 2020లోనే రూసా రూ.15 కోట్లు రిలీజ్​ చేసింది. దీంతో తెలంగాణ స్టేట్​ ఎడ్యుకేషనల్​ వెల్ఫేర్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో  రూ.6 కోట్లతో బిల్డింగ్​ నిర్మాణ పనులు చేపట్టారు. గత ప్రభుత్వం పట్టించుకోక  పనులు నెలల తరబడి సాగుతూ వచ్చాయి. 

ఫండ్స్​ ఉన్నా..
కే -హబ్​ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూసా రూ.50 కోట్లు రిలీజ్​ చేయగా.. అందులో మొదటి దశలో రూ.6 కోట్లతో బిల్డింగ్  నిర్మించారు. ఆ తరువాత రూ.9 కోట్లతో అందులో మౌలిక వసతులు కల్పించడంతో పాటు  రూ.23 కోట్లతో సెంట్రల్​ ఇన్​స్ట్రుమెంటేషన్​ సెంటర్, సెంటర్​ ఫర్​ డ్రగ్​ రీసెర్చ్, సెంటర్ ఫర్​ మాలిక్యూల్స్​ అండ్​ మెటీరియల్​ ఫిజిక్స్, సెంటర్​ ఫర్​ నానో డ్రగ్​ డెలివరీ సిస్టమ్స్, సెంటర్​ ఫర్​ ఇత్నో మెడిసినల్​ ప్లాంట్స్​ తదితర రీసెర్చ్​ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వాటితో పాటు మిగతా రూ.12 కోట్లను యూనివర్సిటీ టీచర్ల వ్యక్తిగత పరిశోధన ప్రాజెక్టుల కోసం వెచ్చించాల్సి ఉంది. కానీ , ఫండ్స్​ రిలీజ్​ అయి ఉన్నా వర్సిటీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు.

కే హబ్​ వినియోగంలోకి వస్తే అర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్(ఏఐ), సైబర్​ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఫార్మా స్యూటికల్‌‌‌‌ సైన్స్‌‌, జియోలాజికల్‌‌ సైన్స్‌‌ తదితర రంగాల్లో పరిశోధనలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. వర్సిటీలో పరిశోధనలు అవరసరమైన అన్ని డిపార్ట్​మెంట్లకు ఇంక్యుబేషన్  సెంటర్ గా కూడా  ఉపయోగపడుతుంది.

వాస్తవానికి కేయూ, యూజీసీ ఆఫీసర్లు ఇక్కడి ప్రొఫెసర్లు ప్రతిపాదించిన ప్రాజెక్టులపై చర్చించి, అప్రూవ్​ అయిన వాటికి సంబంధించిన  రీసెర్చ్​లపై కదలిక తీసుకురావాల్సి ఉంది. కానీ, పట్టించుకునే అధికారులు లేక పరిశోధనలు ముందుకెళ్లడం లేదనే విమర్శలున్నాయి. ఇకనైనా కే -హబ్​ను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఆఫీసర్లు చొరవ తీసుకోవాలని విద్యార్థులు  కోరుతున్నారు.

తొమ్మిది నెలలుగా..
గత పాలకులు పట్టించుకోకపోవడం, విద్యార్థులు పరిశోధనలకు దూరమవుతుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కే హబ్​పై దృష్టి పెట్టారు. బిల్డింగ్​ నిర్మాణం, శానిటరీ వర్క్స్, వాటర్​ సప్లై, ఇంటర్నల్​ ఎలక్ట్రిఫికేషన్​ పనులు పూర్తి చేశారు.

ఈ ఏడాది మార్చి 10న వరంగల్ నగర పర్యటనకు వచ్చిన ఇన్​చార్జి మినిస్టర్​ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు కే హబ్​ను గ్రాండ్​ గా ఓపెన్​ చేశారు. ఆ తరువాత అందులో మౌలిక వసతులు కల్పించడంతో పాటు పరిశోధనలు సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు బిల్డింగ్​కు తాళాలు వేసి పెట్టారు. అప్పటి నుంచి దానిని ఓపెన్​ చేయకపోవడంతో ప్రాంగణమంతా గడ్డి, పిచ్చిమొక్కలతో నిండిపోయింది.