ఉపాధి పనిలో భద్రాద్రి కలెక్టర్..

ఉపాధి పనిలో భద్రాద్రి కలెక్టర్..
  • కూలీలతో కలిసి కొద్దిసేపు పనులు చేసిన జితేశ్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ గురువారం ఉపాధి పని చేశారు. టేకులపల్లి మండలం సులానగర్, చింతలంక, కోయగూడెం, చంద్రు తండా, కొత్త తండా పంచాయతీల్లో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలతో కలిసి కొద్దిసేపు గడ్డ పారతో తవ్వి.. మట్టిని తీసి టెంకలో వేస్తూ పని చేశారు. అనంతరం వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జాబ్ ​కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. మునగ సాగు రైతులతో మాట్లాడుతూ.. మునగ కాయలే కాదు, ఆకు పొడికి మార్కెట్ లో డిమాండ్​ ఉందని.. అవగాహన కల్పించాలని అగ్రికల్చర్ ​ఆఫీసర్లకు సూచించారు. నర్సరీల్లో ప్రజలకు ఉపయోగపడే మొక్కలను పెంచాలన్నారు. ఎండాకాలంలో మొక్కలు చనిపోకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట డీఎల్​పీఓ రమణ, మిషన్​ భగీరథ డీఈ పద్మావతి, విద్యుత్​ శాఖ డీఈ రందస్వామి, ఎంపీడీఓ రవీందర్​రావు ఉన్నారు.