శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీక్.. ఆపకపోతే ఫ్లోర్ శ్లాబ్ పడిపోయే ప్రమాదం

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీక్.. ఆపకపోతే ఫ్లోర్ శ్లాబ్ పడిపోయే ప్రమాదం

శ్రీశైలం: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజీతో ఇబ్బంది తలెత్తినట్టు తెలిసింది. 1వ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ జీరో ఫ్లోర్ నుంచి వారం రోజులుగా నీళ్లు లీకవుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 25న లీకేజ్ సమస్య తలెత్తింది. పంపు మోడ్ జరిగే సమయంలో నీళ్లు ధారలా పడటంతో జెన్ కో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. పంప్ మోడ్ టర్బైన్ వేగంగా తిరగడం వల్లే నీళ్లు లీకవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వాటర్ లీకేజీని నిలువరించకపోతే ఫ్లోర్ శ్లాబ్ పడిపోయే ప్రమాదం లేకపోలేదు.

ఈ వాటర్ లీకేజీకి సంబంధించి ప్లాంట్ అధికారులు ఇప్పటికే రిపోర్ట్ తయారు చేశారు. ఈ ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం 24 ఏళ్ల క్రితం నిర్మించారు. వాస్తవానికి 2024, సెప్టెంబర్ 18 నుంచే ఈ లీకేజీ సమస్య మొదలైంది. ఆరోజు ఫస్ట్ టైం కొంచెం కొంచెంగా నీటి లీకేజీ మొదలైంది. పంపు మోడ్ విధానంలో శ్రీశైలం డ్యాంలోకి నీటిని మళ్లించి, నెల రోజులుగా నిర్విరామంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

ALSO READ | చంద్రబాబు రాకతో తెలంగాణలో మద్యం అమ్మకాలపై ఎఫెక్ట్

ఈ క్రమంలోనే పంపు మోడ్లో టర్భైన్ వేగంగా తిరుగుతూ ఉండటంతో ఆ లీకేజీ మరింత పెరిగి ధారలా నీళ్లు కారసాగాయి. టర్భైన్ లో ఉన్న నీళ్లను పూర్తిగా తొలగించి.. పెన్ స్టాక్ గేట్లను మూసి వేస్తే తప్ప లీకేజీ ప్రాంతాన్ని గుర్తించే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఈ వాటర్ లీకేజీపై రిపోర్ట్ రెడీ చేయాలని హైదరాబాద్ విద్యుత్ సౌధ నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఆ పనిలో తలమునకలై ఉన్నారు. ఈ వాటర్ లీకేజీపై నిపుణులతో చర్చించి పరిష్కారం దిశగా ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారు.