ఇందిరమ్మ స్కీమ్కు ఆఫీసర్లు ఖరారు

ఇందిరమ్మ స్కీమ్కు ఆఫీసర్లు ఖరారు

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీం అమలు, పర్యవేక్షణకు ఎంత మంది ఆఫీసర్లు, సిబ్బంది అవసరం అన్న అంశంపై హౌసింగ్  కార్పొరేషన్  కసరత్తు పూర్తి చేసింది. ప్రతి జిల్లాకు ఎగ్జిక్యూటివ్  ఇంజినీర్ (ఈఈ), రెండు నియోజకవర్గాలకు ఒక డిప్యూటీ ఇంజినీర్ ( డీఈ), ప్రతి నియోజవర్గానికి ఒక ఎగ్జిక్యూటివ్  ఇంజినీర్ ( ఏఈ) తో పాటు టెక్నికల్  వర్క్ ఇన్ స్పెక్టర్ (టీడబ్ల్యూఐ) ను నియమించాలని నిర్ణయించింది. మొత్తం 339 మంది అధికారులను ఈ స్కీంకు ఉపయోగించనున్నారు. ముందుగా ఈ వివరాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పంపుతారు. వారు ఆమోదించాక సీఎస్  శాంతి కుమారి.. జిల్లా కలెక్టర్లకు పంపుతారు. ఈ నెలాఖరులోగా ప్రాసెస్  పూర్తవుతుదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

మాతృశాఖకు కార్పొరేషన్ అధికారులు
ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న హౌసింగ్  కార్పొరేషన్  ఉద్యోగులు తిరిగి తమ మాతృశాఖలో జాయిన్  అయ్యారు.  నియోజకవర్గాలు, మండలాల్లో త్వరలో వీరికి పోస్టింగ్  ఇవ్వనున్నారు. త్వరలో ఇందిరమ్మ స్కీమ్  ప్రారంభం కానున్న నేపథ్యంలో డిప్యూటేషన్లను రద్దు చేయాలని హౌసింగ్  రివ్యూలో సీఎం రేవంత్  ఆదేశించడంతో ప్రిన్సిపల్  సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కార్పొరేషన్లలో పని చేస్తున్న సుమారు 150 ఇంజినీర్లు, ఇతర ఉద్యోగులు హౌసింగ్  కార్పొరేషన్ లో జాయిన్ అయ్యారు. నియోజకవర్గాలు, మండలాల్లో  ఇందిరమ్మ స్కీమ్  అప్లికేషన్లు, లబ్ధిదారుల ఎంపికలో ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోనున్నారు.

త్వరలో స్కీమ్ స్టార్ట్
సొంత జాగా ఉండి ఇల్లు లేని పబ్లిక్ కు 100 శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఇందిరమ్మ స్కీమ్  కింద ఇళ్లు సాంక్షన్  చేయనుంది.  ఇందుకు నాలుగు  దశల్లో రూ.5 లక్షలను లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో బదిలీ చేయనుంది. లబ్ధిదారుల ఎంపికకు ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కూడా పూర్తయింది. స్కీమ్  అమలును త్వరలో స్టార్ట్  చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది..

స్కీమ్​కు ఇతర శాఖల ఇంజినీర్ల సేవలు
ఇందిరమ్మ పథకం అమలు కోసం ప్రభుత్వం హౌసింగ్  కార్పొరేషన్ ను  నోడల్  ఏజెన్సీగా నియమించింది. ప్రస్తుతం తమకు సరిపడా ఇంజినీర్లు  లేరని, మరింత మందిని కేటాయించాలని ఇటీవల రివ్యూ మీటింగ్ లో సీఎం రేవంత్  రెడ్డిని కార్పొరేషన్ అధికారులు కోరారు. వివిధ శాఖలల్లో పనిచేస్తున్న వారిని రిలీవ్  చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. దీంతో వారిని వెంటనే రిలీవ్  చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఇతర శాఖల్లో పనిచేస్తున్న 242 మందిని రిలీవ్  చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే, ఇతర శాఖలు, కార్పొరేషన్లకు చెందిన ఇంజినీర్లను కూడా హౌసింగ్  కార్పొరేషన్ కు డిప్యూటేషన్  మీద తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. అయితే, కీలక శాఖలైన ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్  బీ, పబ్లిక్  హెల్త్, మునిసిపల్, మిషన్  భగీరథ కాకుండా ఇతర కార్పొరేషన్లలో ఉన్న ఇంజినీర్ల వివరాలను మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది.