మిడ్​డే మీల్స్ బిల్లులు ఇక నేరుగా ఏజెన్సీ ఖాతాలో !

మిడ్​డే మీల్స్ బిల్లులు ఇక నేరుగా ఏజెన్సీ ఖాతాలో !
  • వచ్చే ఏడాది నుంచి అమలు చేసే యోచనలో సర్కార్
  • భద్రాద్రి, పెద్దపల్లి జిల్లాల్లోని ఒక్కో మండలంలో స్టడీ
  • 2 వారాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లకు నివేదికలు

హైదరాబాద్/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: రాష్ట్రంలో సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం బకాయిలను ట్రెజరీల ద్వారా కాకుండా.. నేరుగా మిడ్ డే మీల్స్ ఏజెన్సీ ఖాతాల్లోనే జమ చేయలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇది ఎలా అమలు చేయాలనే దానిపై రెండు జిల్లాల్లో సర్కార్ స్టడీ చేయనున్నది. 10 రోజుల్లోనే ఆ నివేదిక వచ్చేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ విధానం సాధ్యమైనంత వరకు వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేసే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తున్నది.

రాష్ట్ర వ్యాప్తంగా 25,941 బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నది. సుమారు 18.19 లక్షల మంది స్టూడెంట్లకు భోజనం అందుతున్నది. ఈ స్కీమ్ కోసం ప్రతినెలా సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే, ఈ పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలవుతున్నది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు అయ్యే ఖర్చులో 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు అందిస్తున్నది. అయితే.. 9,10వ తరగతులకు అయ్యే ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. 

ప్రభుత్వానికి విద్యా కమిషన్ పలు సూచనలు
ప్రస్తుతం మిడ్ డే మీల్స్ కార్మికులకు బిల్లులు చెల్లించడంలో చాలా ఆలస్యమవుతున్నది. ఒక్కోసారి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు మ్యాచింగ్ గ్రాంట్స్ రిలీజ్ చేయకపోతే.. ఏకంగా ఐదారు నెలల పాటు బిల్స్ క్లియర్ కావడం లేవు. దీంతో చాలా బడుల్లో కార్మికులు అప్పులు చేసి వండి పెడ్తున్నరు. చివరికి అప్పులు కట్టలేక మిడ్ డే మీల్స్ బంద్ చేసిన ఘటనలూ ఉన్నాయి. మరోపక్క రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేస్తే కొద్దిపాటి నిధులు రిలీజ్ అయ్యేవి. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ మిడ్ డే మీల్స్ సేవలు మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. నిధులు పెంచడంతో పాటు ప్రతి నెలా బిల్లులు రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి విద్యా కమిషన్ సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

ఏ బిల్ వచ్చిందో తెలియక ఇబ్బందులు
మిడ్ డే మీల్స్ ఏజెన్సీలకు ఆరు, ఏడు రకాల బిల్లులు వేర్వేరుగా వస్తుంటాయి. ప్రధానంగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు, 6 నుంచి 8వ క్లాస్ దాకా, 9,10వ తరగతి వరకు సెపరేట్​గా బిల్లులు ఇస్తుంటారు. దీంతో పాటు ఎగ్స్ బిల్లు, మిడ్ డే మీల్స్ కార్మికుల జీతాలు, స్టూడెంట్లకు కులాల వారీగా బిల్లులు వేర్వేరుగా వస్తున్నాయి. దీంతో ఏ బిల్ వచ్చిందో.. ఏది రాలేదో తెలియక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ క్రమంలోనే స్కూల్ పాయింట్ నుంచి హెచ్ఎం బిల్స్ రెడీ చేసి ఎంఈఓకు పంపితే.. అక్కడి నుంచి ఎంఈఓ, డీఈఓలు వెరిఫై చేసి డైరెక్టరేట్ కు పంపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా బిల్స్ ను ఫైనాన్స్ కు పంపిస్తే.. వారంతా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ వాటాలకు అనుగుణంగా బిల్స్ రిలీజ్ చేస్తుంటారు. తిరిగి బిల్లులన్నీ ఇదే క్రమంలో కింది వరకు చేరుతాయి. ఈ ప్రాసెస్ కు టైమ్ ఎక్కువగా పడ్తున్నది. దీనికి చెక్ పెట్టేందుకు నేరుగా స్టేట్ సెంటర్ నుంచి డబ్బులు కార్మికుడి ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకుంటున్నారు.

రెండు మండలాల్లో అధ్యయనం
మిడ్ డే మీల్స్ బిల్లుల చెల్లింపుపై భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో టీజీ ఆన్​లైన్​తో కలిసి విద్యాశాఖ అధికారులు స్టడీ చేయనున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో కలిసి ఒక్కో మండలంలో ప్రస్తుతం అమలు అవుతున్న తీరును, భవిష్యత్​లో ఎలాంటి విధానం అమలు చేస్తే సమస్యలు ఉండవనే అంశంపై అధ్యయనం చేయనున్నారు. 

ఈ క్రమంలో ప్రధానంగా ఫండ్స్ వస్తున్న విధానం, బకాయిలు ఎలా ఏర్పడుతున్నాయనే వివరాలు సేకరించనున్నారు. ఈ బృందాలు పది రోజుల్లోనే నివేదికను ఆయా జిల్లాల కలెక్టర్లకు అందించి, వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేసి రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు అందించనున్నారు. వీటిపై సమీక్షించి.. దీని అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు.