ఈయేడు దిగుబడి తగ్గిన మిర్చి.. ధర పడిపోవడంతో సగానికి తగ్గిన సాగు విస్తీర్ణం

ఈయేడు దిగుబడి తగ్గిన మిర్చి.. ధర పడిపోవడంతో సగానికి తగ్గిన సాగు విస్తీర్ణం

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది వాణిజ్య పంటలన్నింటిపై తెగుళ్ల ఎఫెక్ట్ భారీగా​పడింది. ఇదివరకే పత్తి దిగుబడి, ధర పడిపోగా..తాజాగా మిర్చీ పరిస్థితి దారుణంగా తయారైంది. రాష్ట్రంలో మిరప సాగు విస్తీర్ణం సగానికి పడిపోయింది. ఇప్పటికే సాగు చేసిన రైతులు కూడా డిమాండ్, ధర లేక నష్టపోతున్నారు.

తామర తెగుళ్ల ఎఫెక్ట్..
రాష్ట్రంలో మిరప సాగు 4 లక్షల ఎకరాల నుంచి 2.34 లక్షల ఎకరాల విస్తీర్ణానికి పడిపోయింది. ఈయేడు సాగు చేసిన మిరపలో 40% పంట తెగుళ్లతో దెబ్బతిన్నది. మిగిలిన 60 నుంచి -70శాతం పంట విస్తీర్ణంలో అయినా దిగుబడి వచ్చినా.. కనీస ధర లభించక రైతులు లక్షల్లో నష్టపోతున్నారు. రాష్ట్రంలో మిర్చి రైతులకు తామర తెగుళ్లు తీవ్ర నష్టం చేస్తుంటే.. మరోవైపు ధర సగానికి పైగా తగ్గింది. దీంతో మిర్చి రైతులు ఆర్థికంగా ఇబ్బందికి గురవుతున్నారు.  

అప్పుల భారం తప్పేలా లేదు..
గత రెండు మూడు సీజన్​లను పరిశీలిస్తే జనవరి నెలలోనే మిర్చీ ధరలు గణనీయంగా పడిపోయినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మిర్చీ ధరలు క్వింటాల్​కు రూ.12వేల నుంచి రూ.14 వేల మధ్యే ఉంది. గతేడాది జనవరిలో మిర్చీ రూ.19వేల వరకు ధర పలికింది. 2023 జనవరిలో రూ.25 వేల  ధర పలికింది. దీన్ని బట్టి గత రెండేండ్లతో పోలిస్తే ఈయేడు  జనవరిలో దాదాపు 12 నుంచి 13 వేలకు ధర పడిపోయింది. గతంలో  పోలిస్తే సగం ధర కూడా మార్కెట్లో లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.