
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మూడు ఓపెన్ కాస్ట్ మైన్స్‌ను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఒడిశాలోని నైనీ, కొత్తగూడెంలోని వీకే ఓసీ, ఇల్లెందులోని పూసపల్లి (జేకే ఓసీ) మైన్స్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభంకానున్నాయి. సింగరేణి చరిత్రలోనే అతి పెద్ద ఓసీగా ఒడిశాలోని నైనీ ఓపెన్‌కాస్ట్ నిలవనుంది. వచ్చే రెండు వారాల్లోపు నైనీ ప్రాజెక్ట్‌ను, జూన్‌లో వీకే ఓసీలో ఓబీ తీసే పనులను ప్రారంభించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
పట్టించుకోని గత ప్రభుత్వం
కొత్తగూడెంలోని వీకే ఓసీ మూడేండ్ల కిందట, ఒడిశాలోని నైనీ ఓసీ, ఇల్లెందులోని పూసపల్లి ఓసీలు గతేడాదే ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఓపెన్ కాస్ట్‌లను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం ఐదేండ్ల కిందే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ సర్కార్‌కు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేకపోవడానికి తోడు అప్పటి సింగరేణి సీఎండీ శ్రీధర్‌తో పాటు డైరెక్టర్లు మైన్స్‌కు పర్మిషన్స్ తెప్పించుకోవడంపై దృష్టి పెట్టలేదు. దీంతో మైన్స్‌కు అనుమతులు రావడంలో ఆలస్యం జరిగింది. ఇది సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు అడ్డంకిగా మారింది.
పర్మిషన్స్ కోసం ముమ్మర ప్రయత్నాలు
ఇంధన అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా కొత్త మైన్స్ ప్రారంభంపై సింగరేణి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్.బలరాం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒడిశాలోని నైనీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌తో పాటు కొత్తగూడెంలోని వీకే ఓసీ, ఇల్లెందులోని పూసపల్లి ఓసీలకు అవసరమైన పర్మిషన్స్ తెప్పించడంపై ఫోకస్ చేశారు.
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి సాయంతో పర్మిషన్స్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. కొత్తగూడెంలోని వీకే ఓసీకి పర్మిషన్ వచ్చే సరికి ఇంకా ఒకటి, రెండు నెలలు పడుతుందని ఆఫీసర్లంతా అనుకున్న టైంలో.. సీఎండీ పక్కా ప్లాన్ ప్రకారం ఢిల్లీలో మకాం వేసి ఈసీ క్లియరెన్స్ తీసుకొచ్చారు. ఓపెన్ కాస్ట్‌కు ఈసీ క్లియరెన్స్ వచ్చిందని సీఎండీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆఫీసర్లకు చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
వీకే ఓసీకి ఈసీ క్లియరెన్స్
కొత్తగూడెంలోని వీకే ఓపెన్ కాస్ట్ మైన్ ప్రారంభానికి కీలకమైన ఈసీ క్లియరెన్స్ శుక్రవారమే వచ్చింది. దీంతో మిగిలిన పర్మిషన్స్ తెప్పించేందుకు యాజమాన్యం దృష్టి పెట్టింది. ఇప్పటికే వీకే ఓసీకి సంబంధించి ఓవర్ బర్డెన్ టెండర్లను సైతం కంప్లీట్ చేసింది. ఈ మైన్‌లో సుమారు 190 మిలియన్ టన్నుల కోల్ డిపాజిట్స్ ఉన్నాయి. ఈ మైన్ జీవిత కాలం సుమారు 30 ఏండ్లుగా నిర్ధారించారు. నాలుగేండ్ల పాటు 5.3 మిలియన్ టన్నులు, తర్వాతి నుంచి ఏడాదికి 6.3 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయనున్నారు. జీకే ఓసీ నుంచి పీవీకే 5 ఇంక్లైన్ వరకు బొగ్గు తవ్వకాలను చేపట్టనున్నారు. వీకే ఓసీలో భాగంగా ఇప్పటికే వీకే 7 ఓపెన్ కాస్ట్‌ను యాజమాన్యం మూసేసింది. జీకే ఓసీలో బొగ్గు ఉత్పత్తి నామమాత్రంగా సాగుతోంది. వీకే ఓసీ నుంచి జూన్‌లో తవ్వకాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద ఓసీ
135 ఏండ్ల సింగరేణి చరిత్రలోనే అతి పెద్ద ఓపెన్ కాస్ట్ మైన్‌గా ఒడిశాలోని నైనీ ప్రాజెక్ట్ నిలవనుంది. మొదటి ఏడాదిలో కనీసం ఐదు మిలియన్ టన్నులు, తర్వాతి ఏడాది నుంచి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ మైన్‌లో 340 మిలియన్ టన్నుల కోల్ డిపాజిన్స్ ఉన్నాయి. సుమారు 38 ఏండ్ల పాటు నైనీ ఓపెన్ కాస్ట్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు. నైనీ ఓపెన్ కాస్ట్ మైన్‌ను ఏప్రిల్ మొదటి, రెండు వారాల్లో ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.
పూసపల్లి ఓసీలో ఆగస్టు నుంచి తవ్వకాలు
సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లైన ఇల్లెందులోని పూసపల్లి (జేకే 5 ఓసీ) ఓపెన్ కాస్ట్‌లో ఆగస్టు నుంచి తవ్వకాలు చేపట్టేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ మైన్‌లో సుమారు 20 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వాలని యాజమాన్యం లక్ష్యంగా నిర్దేశించుకుంది.