- కొన్నేళ్లుగా రెవెన్యూ, ఫారెస్ట్ హద్దులు తేలక వివాదం
- సర్వే నెంబర్ల వారీగా డీమార్కేషన్‌కు చర్యలు
- అటవీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక బృందాల ఏర్పాటు
- వారం రోజుల్లో పూర్తి చేసేందుకు కసరత్తు
హనుమకొండ, వెలుగు: కొన్నేళ్లుగా ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్రమణల పేరుతో చర్చల్లోకి ఎక్కుతున్న ఇనుపరాతి గుట్టల్లో భూవివాదాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటవీశాఖ పరిధిలో నోటిఫై చేసిన భూములకు, రైతుల పట్టా ల్యాండ్స్ కు హద్దులు తెలియక తరచూ ఇక్కడ వివాదాలు తలెత్తుతుండగా, పట్టాదారులు, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి.
పట్టా, ఫారెస్ట్ భూముల మధ్య హద్దులు లేకపోవడం సమస్యగా మారగా 'వెలుగు' దినపత్రికలో పలుమార్లు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఇటీవల కూడా అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు ఇనుపరాతి గుట్టల్లోని అటవీ భూముల లెక్క తేల్చేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. సోమవారం నుంచి ఇనుపరాతి గుట్టల్లోని ఫారెస్ట్ భూముల సర్వే చేపట్టనున్నారు. ఆ తర్వాత ఇనుపరాతి గుట్టలను ఎకో టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోనున్నారు.
రైతులు వర్సెస్ఫారెస్ట్ ఆఫీసర్లు..
ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లా ప్రజలకు సుపరిచితమైన ఇనుపరాతి గుట్టలు ప్రస్తుత హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో దాదాపు 4 వేల ఎకరాలకు పైగా విస్తరించి ఉండేవని స్థానికులు చెబుతున్నారు. అటవీప్రాంతం కావడం, విలువైన ఖనిజ నిక్షేపాలు, ఏడాదంతా పారే జాలులు, వివిధ పశుపక్ష్యాదులకు నిలయంగా ఉండటంతో దీనిని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ ప్రతిపాదన నేపథ్యంలో దాదాపు ఆరేండ్ల కిందట ఆఫీసర్లు ఫారెస్ట్ భూములను సర్వే చేయించారు.
ఈ మేరకు ధర్మసాగర్ మండలం దేవునూరు శివారులో 1,095 ఎకరాలు, ముప్పారం శివారులో 906, వేలేరు మండలం ఎర్రబెల్లి శివారు 820, ఎల్కతుర్తి మండలం దామెర శివారు 560, భీమదేవరపల్లి మండలం కొత్తపెల్లి శివారులో 594 ఎకరాలున్నట్లు గుర్తించారు. మొత్తంగా దాదాపు 3,975 ఎకరాల మేర ఫారెస్ట్ భూములున్నట్లు తేల్చారు.
అయితే ఫారెస్ట్భూములను గతంలో కొందరు ఆఫీసర్లు ప్రైవేటు వ్యక్తుల పేరున పట్టాలు చేశారనే ఆరోపణలుండగా, ఆ తర్వాత పట్టాదారులు, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తమ పట్టా భూములను దున్నుకుంటుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపిస్తుంటే, అదంతా ఫారెస్ట్ల్యాండ్ అని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇనుపరాతి గుట్టలను ఆనుకుని ఉన్న ఫారెస్ట్, పట్టా భూములపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది.
రైతులంతా సహకరించాలి..
ఇనుపరాతి గుట్టల్లోని ఫారెస్ట్భూముల్లో నోటిఫై చేసిన సర్వే నెంబర్లకు డీమార్కేషన్నిర్వహిస్తాం. ఇందుకు ప్రత్యేక టీమ్‌లను కూడా ఏర్పాటు చేశాం. వారంలోగా సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. అక్కడి సర్వే నెంబర్లకు చుట్టుపక్కల ఉన్న రైతులు హద్దులు చూసుకోవడంతోపాటు సర్వే టీమ్‌లకు సహకరించాలి.
రాథోడ్రమేశ్, ఆర్డీవో, హనుమకొండ
నేటి నుంచి సర్వే షురూ..
రైతులు, ఫారెస్ట్ఆఫీసర్లకు మధ్య గొడవల నేపథ్యంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవల రైతులు, ఫారెస్ట్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. విభేదాలు సాల్వ్ చేసేందుకు ఇండియన్ఫారెస్ట్యాక్ట్, 1927 సెక్షన్ 4 ప్రకారం అటవీ భూములు నోటిఫై చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ఇనుపరాతి గుట్టల్లోని ఫారెస్ట్ భూముల్లో నోటిఫై చేసిన సర్వే నెంబర్లకు డీమార్కేషన్చేపట్టేందుకు ఆఫీసర్లు రెడీ అయ్యారు. దానిప్రకారం వివాదాలకు కారణమవుతున్న భూముల్లో సోమవారం నుంచి సర్వే చేపట్టనున్నారు.
దేవునూరు, ముప్పారం, ఎర్రబెల్లి, దామెర, కొత్తపల్లి శివారులో సర్వే నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో ఊరును ఒక్కో టీమ్ కు అప్పగించి, అందులో ఒక ఫారెస్ట్ ఆఫీసర్, ఇద్దరు సర్వేయర్లు, ఒక ఆర్ఐని నియమించారు. ఎక్కడికక్కడ హద్దులు నిర్ణయించి, ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. అనంతరం ఇనుపరాతి గుట్టలు, ధర్మసాగర్ రిజర్వాయర్ ను కలుపుతూ ఎకో టూరిజం హబ్ గా డెవలప్చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు.