హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చే వర్షాకాలం నాటికి హైదరాబాద్‌ను సీవరేజీ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా పనులు చేస్తున్నామని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. ప్రతి మ్యాన్ హోల్‌కు ఒక యూనిక్ ఐడీ ఇచ్చి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. 90 రోజుల యాక్షన్ ప్లాన్‌కు సంబంధించి బుధవారం వాటర్‌బోర్డు హెడ్డాఫీసులో ప్రెస్‌మీట్‌పెట్టి వివరాలు వెల్లడించారు. వాటర్ బోర్డుకు ప్రతి నెలా 70 వేల నుంచి 75 వేల ఫిర్యాదులు వస్తున్నాయని, ఇందులో 60 శాతం వరకు సివరేజీ ఓవర్ ఫ్లోకి సంబంధించే ఉంటున్నాయన్నారు.
డ్రైవ్ ప్రారంభించి 70 రోజులు పూర్తయిందని, 3,600 కిలో మీటర్ల సీవరేజ్ పైపు లైన్, 3 లక్షల మ్యాన్ హోల్స్ డీ-సిల్టింగ్ చేయడంతోపాటు సీవరేజీ ఫిర్యాదులను 30 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. బోర్డు పరిధిలో 6 లక్షల మ్యాన్ హోల్స్ ఉండగా కోర్ సిటీలోని 3లక్షల మ్యాన్ హోల్స్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. బుధవారం నాటికి 12,673 ప్రాంతాల్లో 1,602 కిలోమీటర్ల మేర సీవరేజీ పైప్లైన్లలో, 1.22 లక్షల మ్యాన్ హోల్స్ లో పూడిక తీసినట్లు వెల్లడించారు.
ప్రతి మ్యాన్ హోల్ కి ఒక యునిక్ ఐడీ ఇచ్చి, అందులో దాని సమాచారం ఉంచుతున్నామన్నారు. స్పెషల్ డ్రైవ్ పనుల పర్యవేక్షణకు హెడ్డాఫీసులో ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు చేశామని ఎండీ అన్నారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, ఈఎన్సీ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ ఆపరేషన్స్-2 స్వామి, డైరెక్టర్ ఆపరేషన్స్-2 అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.