మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున ఫిర్యాదుతో నమోదైన క్రిమినల్, పరువు నష్టం దావా కేసులో నాగార్జున వాంగ్మూలాన్ని నాంపల్లి స్పెషల్ కోర్టు రికార్డు చేసింది. సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, దేశ వ్యాప్తంగా అక్కినేని కుటుంబం పట్ల ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయని వాంగ్మూలంలో నాగార్జున చెప్పారు.
జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారని తన వాంగ్మూలంలో నాగార్జున చెప్పారు. అలా మాట్లాడం వలన తమ పరువుప్రతిష్టలకు భంగం వాటిల్లిందని, మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో నాగార్జున కోరారు.
నాగార్జున తన వాంగ్మూలంలో ఇంకా ఏం చెప్పారంటే..
* మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్నీ అసత్య ఆరోపణలు
* రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు
* ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మా కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది
* మా కుటుంబం మానసిక క్షోభకు గురైంది
* మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
* బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడటం, మా సినీ రంగం మీద రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు
హీరో నాగచైతన్య, సమంత దంపతుల విడాకులకు కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబంతో పాటు టాలీవుడ్ భగ్గుమంది. మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ వివాదం అంతటితో సమసిపోలేదు.
ALSO READ | నాంపల్లి కోర్టుకు నాగార్జున: మంత్రి సురేఖపై స్టేట్మెంట్
మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తన కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగిందని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు. నాగార్జున పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించడంతో ఆయన తన వాంగ్మూలం ఇచ్చేందుకు నాంపల్లి స్పెషల్ కోర్టుకు మంగళవారం హాజరయ్యారు. ఆయనతో పాటు నాగచైతన్య, అమల కూడా కోర్టుకు వెళ్లారు.