దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే రోజుల పాటు ( జూన్ 10 నుంచి) పలు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణశాఖ వెల్లడించింది.ఈ నేపథ్యంలో వచ్చే రెండు రోజులు ( జూన్ 10,11) దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాతోపాటు కోస్తా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ముంబై, తెలంగాణతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు ముందుగా వర్షాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ చెప్పింది. ఈ క్రమంలో ముంబయి, మరఠ్వాడా, కొంకణ్ గోవా, మధ్య కర్ణాటక, కేరళ, లక్షద్వీప్‌లలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతోపాటు కోస్తాంధ్రా, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
మరోవైపు రానున్న 5 రోజుల్లో తూర్పు మధ్య భారతదేశం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే 5 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, బెంగాల్, సిక్కింలలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ క్రమంలో కేరళలోని ఐదు జిల్లాలైన పతనంతిట్ట, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసరగోడ్‌లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్, మలప్పురం సహా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.