పుష్ప 2 ఎఫెక్ట్: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, లాఠీ చార్జ్.. ఇద్దరు బాలురకు అస్వస్థత

పుష్ప 2 ఎఫెక్ట్: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, లాఠీ చార్జ్.. ఇద్దరు బాలురకు అస్వస్థత

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన పుష్ప 2 మూవీ మేనియా నెలకొంది. అల్లు అర్జున్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తోన్న పుష్ప 2 మూవీ ప్రీమియర్స్ బుధవారం (డిసెంబర్ 4) పడ్డాయి. పుష్ప 2 మూవీ విడుదలతో అల్లు అభిమానుల సంతోషానికి హద్దే లేకుండాపోయింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుండటంతో థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేశారు. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలభిషేకాలు, బ్యాండ్లు, డీజేలు ఏర్పాటు చేసి థియేటర్ల వద్ద పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు స్టైలిస్  స్టార్ ఫ్యాన్స్. 

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే పుష్ప 2కి అభిమానులు నీరాజనం పలికారు. ముఖ్యంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‎లోని సంధ్య థియేటర్ వద్ద అల్లు అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సంథ్య  థియేటర్ ను మొత్తం అల్లు అర్జున్ ఫ్లెక్లీలు, బ్యానర్లతో కప్పేశారు. థియేటర్ ముందు పెద్ద ఎత్తున డీజే, లైటింగ్ ఏర్పాటు చేసి హోరెత్తించారు. మూవీ విడుదల రోజు అభిమానుల జోష్‎ను డబుల్ చేశాడు అల్లు అర్జున్. 

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో ఫ్యాన్స్ తో కలిసి మూవీ వీక్షించేందుకు వచ్చాడు బన్నీ. ఓ వైపు సినిమా విడుదల ఆనందం.. మరోవైపు తమతో కలిసి మూవీ చూసేందుకు తమ అభిమాన హీరో రావడంతో సంధ్య థియేటర్‎లో ప్రీమియర్ మూవీ చూడటానికి వెళ్లిన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అల్లు అర్జున్ వస్తున్నాడని తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ వద్ద తీవ్ర ఉద్రికత్త నెలకొంది. 

అల్లు అర్జున్ రాకతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మొత్తం బన్నీ ఫ్యాన్స్‎తో జామ్ అయిపోయింది. ఈ క్రమంలోనే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బాలురు సృహ కోల్పోయారు. వెంటనే  అప్రమత్తమైన చుట్టుపక్కల వారు అస్వస్థతకు గురైన పిల్లలకు సీపీఆర్ చేసి అనంతరం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు థియేటర్ వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.