
పొలాల్లో నుంచి దూసుకెళ్లిన రైతులు, మహిళలపై లాఠీచార్జ్
వందలాది మంది అరెస్టు
టీడీపీ ఎంపీలు, జేఏసీ నేతల హౌస్ అరెస్టు
8 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని ప్రాంత రైతులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అమరావతి పరిరక్షణ జేఏసీ పిలుపు మేరకు పొలాల వెంబడి ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకొచ్చిన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఎక్కడికక్కడ రైతులను అదుపులోకి తీసుకుని వ్యాన్లలో స్టేషన్లకు తరలించారు. 3 రాజధానుల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానినిఎలా మారుస్తారంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని గ్రామాల నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా బయలుదేరారు. అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొందరు రైతులు పొలాల వెంబడి వెలగపూడి సెక్రటేరియట్ వైపు బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు రైతులను అడ్డుకోవడం కోసం పొలాల్లోకి పరుగులు తీశారు. పోలీసుల నుంచి తప్పించుకుని 200 మందికి పైగా రైతులు సెక్రటేరియట్ వెనుక ప్రాంతానికి చేరుకున్నారు. పంటకాలువల్లోకి దిగి సేవ్ అమరావతి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రైతులు లోపలికి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురు రైతులు, మహిళలు గాయపడ్డారు. వందలాది రైతులు, మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
ఎక్కడిక్కడ అరెస్టులు
అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో 8 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల ఐకాస, అమరావతి పరిక్షణ జేఏసీ, వామపక్షాల నేతలను ఆదివారం రాత్రి నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నవులూరు, నీరుకొండ, తుళ్లూరు, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు ఆందోళన చేపట్టారు. సెక్రటేరియట్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగడంతో పోలీసులు రైతులను చెదరగొట్టారు. రాజధాని గ్రామాల్లో రైతులను ఎక్కడికక్కడ అరెస్టు చేసిన పోలీసులు ఆందోళన కోసం ఏర్పాటు చేసుకున్న టెంట్లను తొలగించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల కోసం సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లే సమయంలో పోలీసులు భారీ భద్రత చర్యలు తీసుకున్నారు.
టీడీపీ నేతల అరెస్టు
అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. కేశినేనిని ఉదయమే అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడలోని ఇంటికి తరలించి హౌస్ అరెస్టు చేశారు. తుళ్లూరు వద్ద గల్లా జయదేవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. ఎంపీ గల్లా చొక్కా చిరిగిపోయింది.
చిరిగిన చొక్కాతోనే ఎంపీని చిలకలూరిపేట పోలీసు స్టేషన్ కు తరలించారు. రైతులకు మద్దతుగా హైదరాబాద్ విజయవాడ హైవే పై గొల్లపూడి వద్ద ఆందోళనకు దిగిన దేవినేని ఉమను అరెస్ట్ చేశారు.