సాగర్ –శ్రీశైలం మధ్య లాంచి ప్రయాణం షురూ

నాగార్జున సాగర్,  శ్రీశైలం మధ్య మళ్లీ లాంచీ ప్రయాణం మళ్లీ మొదలైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు సాగర్ నుంచి లాంచీ బయల్దేరింది. కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో లాంచి ప్రయాణం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు తగినంత నీటి మట్టం కొనసాగుతుండడంతో లాంచి ప్రయాణాన్ని పునరుద్ధరించారు. సాయంత్రం శ్రీశైలంలో దైవదర్శనం అనంతరం పర్యాటకులు రాత్రి అక్కడే బస చేయనున్నారు. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు శ్రీశైలంలో లాంచీ బయల్దేరనుంది. సాయంత్రం 3 గంటలకు నాగార్జునసాగర్ కు చేరుకోనుంది. 
కృష్ణమ్మ పరవళ్లను ఆస్వాదిస్తూ.. పచ్చని కొండలు, నల్లమల అటవీ అందాలు తిలకిస్తూ ఆహ్లాదంగా ప్రయాణించే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి లాంచి ప్రయాణం నిజంగా శుభవార్తేనని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. లాంచి ప్రయాణానికి టికెట్ ధరలు కూడా గతంలో నిర్ణయించిన ధరలే కొనసాగిస్తున్నారు. సాగర్ నుంచి శ్రీశైలానికి ఒక వైపు ప్రయాణానికి పెద్దలకు 15 వందల రూపాయలు, పిల్లలకు 12 వందల రూపాయలుగా నిర్ణయించారు. రెండువైపులా ప్రయాణానికి పెద్దలకు 2 వేల 500 రూపాయలు, పిల్లలకు 2 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.