ప్రైవేట్​ హాస్పిటల్స్ అంటేనే ప్రజలు భయపడుతున్నరు : మంత్రి బండి సంజయ్​

ప్రైవేట్​ హాస్పిటల్స్ అంటేనే ప్రజలు భయపడుతున్నరు : మంత్రి బండి సంజయ్​

 

  • చెప్పేదొకటి.. డిశ్చార్జ్ అప్పుడు వేసే బిల్లు మరోటి: బండి సంజయ్​
  • నెలజీతంపై బతికేవాళ్లు హాస్పిటల్​ బిల్లులు కట్టలేకపోతున్నరు 
  • మెడికోవర్డ్​ ఫ్యామిలీ కార్డు రిలీజ్​చేసిన కేంద్ర సహాయ మంత్రి

హైదరాబాద్  /మాదాపూర్​, వెలుగు: ప్రైవేట్​ హాస్పిటల్స్​ అంటేనే  ప్రజలు జంకుతున్నారని, దవాఖాన బిల్లులు భరించలేకపోతున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్  అన్నారు. హాస్పిటల్​లో చేరినప్పుడు చెప్పినదానికన్నా డిశ్చార్జ్​ సమయంలో ఐదారు రెట్లు ఎక్కువగా బిల్లు వేస్తున్నారని తెలిపారు. ‘‘నాకు తెలిసినవాళ్లు ఓ హాస్పిటల్​లో చేరారు. మొదట రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. తీరా డిశ్చార్జి సమయంలో రూ.16 లక్షల బిల్లు వేశారు. నెలజీతంపై బతికే ఆ కుటుంబం అంత ఫీజు ఎలా కడుతుంది?” అని ప్రశ్నించారు. డిశ్చార్జి కోసం తనను సంప్రదించారని గుర్తుచేశారు.

 హైదరాబాద్​లోని సైబర్​ గేట్​ వద్దనున్న మెడికోవర్​ దవాఖాన మేనేజ్​మెంట్​ కొత్తగా ప్రవేశపెట్టిన ‘మెడికోవర్డ్​ ఫ్యామిలీ కార్డు’ను బండి సంజయ్​ ఆదివారం రిలీజ్​ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. యూరప్​లో మెడికోవర్​ పాపులర్​ ఆసుపత్రి అని తెలిపారు. ఈ దవాఖాన డాక్టర్​ శరత్​రెడ్డితో తనకు సన్నిహిత సంబంధం ఉన్నదని గుర్తు చేశారు. ఈ రోజు తాను ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం డాక్టర్​ శరత్, డాక్టర్​ సాహు అని తెలిపారు.

2012లో కరీంనగర్​లో ర్యాలీ చేస్తుంటే తనకు హార్ట్​స్ట్రోక్​ వచ్చిందని, డాక్టర్​ సాహుతో మాట్లాడిన డాక్టర్​ శరత్​ తనకు విజయవవంతంగా శస్త్రచికిత్స జరిగేలా చూశారని, తనను బతికించారని చెప్పారు. ఇది తనకు పునర్జన్మ అని అన్నారు.  ఆసుపత్రి అంటే భరోసా కల్పించేలా ‘మెడికోవర్డ్ ఫ్యామిలీ కార్డు’ను  ప్రవేశపెట్టడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్డు తీసుకున్న కుటుంబ సభ్యులందరికీ 15–50 శాతం వరకు ఆసుపత్రి బిల్లులో డిస్కౌంట్ ఇస్తుండడం హర్షనీయమని అన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సీఎండీ, డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ, డాక్టర్ శరత్ రెడ్డి, క్రిష్ణ ప్రసాద్, హరికృష్ణ, నటుడు  శ్రీరాం పాల్గొన్నారు.