నన్ను చంపేందుకు రాజ్​తరుణ్, శేఖర్​బాషా కుట్ర .. నార్సింగి పోలీసులను ఆశ్రయించిన లావణ్య

నన్ను చంపేందుకు రాజ్​తరుణ్, శేఖర్​బాషా కుట్ర .. నార్సింగి పోలీసులను ఆశ్రయించిన లావణ్య

గండిపేట, వెలుగు: సినీ నటుడు రాజ్‌తరుణ్, అతడి స్నేహితుడు ఆర్జే శేఖర్‌ బాషా తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని లావణ్య ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం మరోసారి నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ“నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నాకు, రాజ్​తరుణ్ కు సంబంధించిన కేసు కోర్టులో ఉంది. ఇటీవల నాపై కొంత మంది దాడి చేశారు. వారిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి ప్రతి నిమిషం ప్రాణభయంతో బతుకుతున్నాను. నిన్న సాయంత్రం నలుగురు మహిళలు మా ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించారు. 

నా ప్రాణం పోయాక వారిని పట్టుకుంటారా?. నాలుగేండ్ల కింద రాజ్, నేను తెలిసిన వ్యక్తి వద్ద రూ.55 లక్షలు అప్పు తీసుకున్నాము. గొడవల కారణంగా రెండేండ్ల నుంచి వడ్డీ కట్టలేదు. అప్పు ఇచ్చిన వ్యక్తి ఇటీవల ఫోన్‌ చేసి డబ్బు అడిగారు. లేనిపక్షంలో ఇల్లు స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. వారం రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. ఒకవేళ రాజ్‌తరుణ్‌ రూ.55 లక్షలు చెల్లించినా ఆ ప్రాపర్టీని అతడికి ఇవ్వవద్దు. అందులో నా వాటా కూడా ఉంది. ఇంత జరుగుతున్నా రాజ్‌తరుణ్‌ నాతో మాట్లాడడం లేదు.’’ అని లావణ్య చెప్పింది. తనను ఇబ్బంది పెట్టడంతోపాటు చంపేయాలని రాజ్ తరుణ్, శేఖర్‌ భాషా ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.