నేనే హోం మంత్రినైతే.. పరిస్థితి మరోలా ఉండేది: పవన్ కళ్యాణ్

నేనే హోం మంత్రినైతే.. పరిస్థితి మరోలా ఉండేది: పవన్ కళ్యాణ్
  • ఏపీలో క్రిమినల్స్ ​రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నరు?
  • ఆడబిడ్డలను రక్షించాల్సిన బాధ్యత మీది కాదా?
  • హోంమంత్రి అనిత కఠినంగా ఉండాలి.. లా అండ్ ఆర్డర్ బాలేదు
  • యోగి సర్కార్​లా వ్యవహరిస్తేనే పరిస్థితి మారుతదేమోనని వ్యాఖ్య
  • కూటమిని ఎవరూ విడదీయలేరని వెల్లడి

హైదరాబాద్ , వెలుగు: ఏపీలో జరుగుతున్న లైంగికదాడులపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని, హోం మంత్రి అనిత స్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. లేదంటే తానే హోంమంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందేమోనని సంకేతాలు ఇచ్చారు. ఆయన కామెంట్లు సంచలనంగా మారాయి. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి బాగోలేదని, పోలీసులు సరిగ్గా స్పందించడం లేదని మండిపడ్డారు. క్రిమినల్స్‌‌‌‌‌‌‌‌కు కులం, మతం ఉండదని అన్నారు. సంబంధిత మంత్రులు బాధ్యతాయుతంగా మెలగాలని, మంత్రులు చలనం లేకుండా ఉంటే క్రిమినల్స్ రెచ్చిపోతారని అన్నారు. సోమవారం తన నియోజకవర్గం పిఠాపురంలోని గొల్లప్రోలులో పవన్​ కల్యాణ్​ పర్యటించారు. అక్కడ ఆయన మాట్లాడారు. పిల్లలపై లైంగికదాడులు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు, నేను ప్రత్యేక దృష్టిసారించాం. అయినప్పటికీ కొందరు పోలీసులు అలసత్వం వీడటం లేదు. నిజాయితీగా పనిచేయాలని చెప్తే మీనమేషాలు లెక్కిస్తున్నారు. 

మూడేండ్ల చిన్నారిని క్రిమినల్స్​ రేప్ చేసి చంపేస్తే కులం గురించి మాట్లాడుతున్నారు... కొందరు ఐపీఎస్ అధికారులు క్రిమినల్స్‌‌‌‌‌‌‌‌ను వెనకేసుకుని వచ్చేలా వ్యవహరిస్తున్నారు. నేను హోం శాఖ మంత్రినైతే పరిస్థితి మరోలా ఉంటుంది. ధైర్యం లేనివారు పోలీసులుగా ఉండటం ఎందుకు?’’ అని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా వ్యవహరిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుందేమో! డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వంలో మాదిరిగా ఉంటే కుదరదు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులది కాదా? ఎందుకు యాక్షన్​ తీసుకోవడంలేదు. బయటకు వస్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. ప్రజల కోసమే కదా మనం ఉన్నది. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత లేదా?” అని ప్రశ్నించారు. 

నాకు పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే

తనకు డిప్యూటీ సీఎం పదవి, ఎమ్మెల్యే పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని పవన్​ కల్యాణ్​ అన్నారు. ‘‘వసతి గృహాల్లో ఉండే అమ్మాయిలను కొందరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. ఎంతమంది కూటమి ఎమ్మెల్యేలు వసగతి గృహాలను సందర్శించారు? వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం మనకు లేదా?” అని ప్రశ్నించారు. ‘‘ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణ బాధ్యతలను పోలీసులు తీసుకోవాలని క్లియర్​గా చెప్పాం. గత ప్రభుత్వంలో మాదిరిగా ఉండొద్దని చెప్పాం. ఆడబిడ్డల విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు. ఇప్పటి ముఖ్యమంత్రి భార్యను కూడా గత ప్రభుత్వంలో తిట్టారు. అప్పట్లో నాటి ముఖ్యమంత్రి ఆదేశిస్తే నన్ను చంపేస్తామని ఒకడు.. నా ఇంట్లోని ఆడపడుచుల మీద అఘాయిత్యం చేస్తామని ఇంకొకడు అన్నాడు. 

ఇట్లా ఇష్టమున్నట్లు మాట్లాడుతుంటే ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా నాకు కోపం రాదా? నాడు ఒక్క పోలీసు కూడా ఎందుకు మాట్లాడలే? వాళ్లు అలా మాట్లాడుతుంటే పోలీసులు యాక్షన్​ తీసుకోకపోవడంతోనే ఇప్పుడు కూడా క్రిమినల్స్​ రెచ్చిపోతున్నారు. పోలీసులకు బాధ్యత లేదా? రేప్​లు చేస్తామంటూ  సోషల్ మీడియాలో బెదిరిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని ఆయన మండిపడ్డారు. తప్పు చేసే వాడు ఎవడైనా సరే, ఏ కులంవాడైనా సరే, ఎవరి బంధువైనా సరే వదిలిపెట్టొద్దని తేల్చిచెప్పారు. కాగా.. లీడర్ల మధ్య గొడవ పెడ్తే కూటమి విడిపోతుందని కొందరు భావిస్తున్నారని, అలాంటి పరిస్థితి ఉండదన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని ఎవరూ చెడగొట్టలేరని ఆయన స్పష్టం చేశారు.