
- విదేశీ లాయర్లను అనుమతించడం సరికాదు: ఐలు
హైదరాబాద్, వెలుగు: న్యాయవాదుల బిల్లు ముసాదాను సవరిస్తామని కేంద్రం ప్రకటించడాన్ని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్( ఐలు) రాష్ట్ర అధ్యక్షుడు సత్యానారాయణ, ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి తప్పుబట్టారు. న్యాయవాదుల చట్ట సవరణ ముసాయిదా న్యాయవాద వృత్తికి, మనుగడకు ప్రమాదకరమన్నారు.
విదేశీ లాయర్లు మన దేశంలో ప్రాక్టీస్‌కు అనుమతించడం, బార్ కౌన్సిల్ స్వాతంత్ర్యాన్ని కాలరాయడమే అని అభిప్రాయపడ్డారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. కొత్త బిల్లుపై అభ్యంతరాలు, సూచనలతో కూడిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. కేంద్ర ముసాయిదాలో న్యాయవాదుల రక్షణ, సంక్షేమం గురించి ఏమీ లేకపోగా.. వృత్తిని నిర్వీర్యం చేసే ప్రతిపాదనలు ఉన్నాయని విమర్శించారు.
1961 న్యాయవాదుల చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. క్రిమినల్ కేసుల విచారణలో న్యాయవాదులను అనర్హులుగా ప్రకటించే నిబంధనను వ్యతిరేకించారు. నాయకులు రామచంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మామిడి వెంకటరెడ్డి, మందడపు శ్రీనివాసరావు, మాధవరెడ్డి, వెంకటేశ, శర్మ, వేణుగోపాల్, రమేష్ కుమార్ మక్కడ్ తదితరులు పాల్గొన్నారు.