మలక్​పేటలో లా స్టూడెంట్ అనుమానాస్పద మృతి

మలక్​పేటలో లా స్టూడెంట్ అనుమానాస్పద మృతి
  • లైంగిక వేధించి, హత్య చేశారని గిరిజన సంఘాల ఆందోళన

హైదరాబాద్​సిటీ, వెలుగు: మలక్​పేటలో లా స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా కడ్తల్​పక్కన ఓ తండాకు చెందిన  రమేశ్, కంసీ దంపతుల కూతురు ఇస్లావత్ శ్రావ్య (20) ఎల్బీనగర్​లోని మహాత్మా గాంధీ లా కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. ఓ సీనియర్ అడ్వొకేట్ దగ్గర జూనియర్​గా ఉంటూనే మలక్ పేట మూసారంబాగ్​లోని ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది. 

ఆదివారం కన్సల్టెన్సీ యజమాని నవీన్ కార్యాలయంలో ఫ్యాన్​కు ఉరేసుకొని శ్రావ్య ఆత్మహత్య చేసుకుంది. అయితే, శ్రావ్యది ఆత్మహత్య కాదని, లైంగిక వేధించి హత్య చేశారని యువతి కుటుంబసభ్యులతో కలిసి  గిరిజన సంఘాలు మలక్ పేట మెట్రో స్టేషన్ వద్ద రాస్తారోకోకు దిగారు. శ్రావ్య మృతికి కారకులైన నవీన్​ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

ఘటన జరిగిన కొద్దిసేపటికే పోలీసులు హుటాహుటిన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు 
చెప్పారు.