- ఫలితాలు విడుదల చేసిన లింబాద్రి
- ర్యాంకు కార్డులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచన
- కాలేజీలకు గుర్తింపు రాగానే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన లాసెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు గురువారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌లో కౌన్సిల్ వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ఎస్‌కే మహమూద్‌తో కలిసి టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ నెల 3న నిర్వహించిన పరీక్షలకు మొత్తం 50,684 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 40,268 మంది పరీక్ష రాయగా, 29,258 (72.66%) మంది ఉత్తీర్ణులయ్యారు.
మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 27,993 మంది పరీక్ష రాయగా, 20,510 (73.27%) మంది అర్హత సాధించారు. ఐదేండ్ల ఇంటిగ్రేటేడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో 8,412 మంది పరీక్ష రాయగా, 5,478(65.12%) మంది అర్హత సాధించారు. రెండేండ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులో అడ్మిషన్లకు 3,863 మంది రాయగా, 3,270 (84.65%) మంది క్వాలిఫై అయ్యారు. ర్యాంకు కార్డులను https://lawcet.tsche.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 30 లా కాలేజీలు ఉన్నాయని, వాటిలో 8,180 సీట్లు ఉన్నాయని తెలిపారు. యూనివర్సిటీల పరిధిలో 4, సంక్షేమ శాఖల పరిధిలో మరో 4 కాలేజీలు ఉన్నాయని, మిగిలినవి ప్రైవేట్ కాలేజీలని తెలిపారు.
ఇప్పటికే కాలేజీల గుర్తింపు కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు పంపించామని చెప్పారు. అక్కడి నుంచి గుర్తింపు రాగానే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మి నారాయణ, లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ జీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీటెక్ పూర్తయినోళ్లు 4,485 మంది క్వాలిఫై...
మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు క్వాలిఫై అయిన వారిలో బీటెక్ పూర్తయిన అభ్యర్థులు భారీగా ఉన్నారు. అత్యధికంగా బీకామ్ అభ్యర్థులు 5,790 మంది ఉండగా, బీఎస్సీ అభ్యర్థులు 5,068 మంది ఉన్నారు. బీటెక్ అభ్యర్థులు 4,485 మంది ఉత్తర్ణత సాధించారు. వీరితో పాటు బీఏ అభ్యర్థులు 4,044 మంది, ఫార్మసీ అభ్యర్థులు 346 మంది, బీబీఏ అభ్యర్థులు 321 మంది ఉన్నారు. ఎంబీబీఎస్ అభ్యర్థులు 68 మంది, బీడీఎస్ అభ్యర్థులు 38 ఉండటం గమనార్హం.