ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ శనివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉన్న సిద్ధిఖీపై దుండగులు 9ఎంఎం పిస్టళ్లతో కాల్పులు జరిపారు. వెంటనే ఆయనను లీలావతి ఆస్పత్రికికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందారు. ఈ హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.
ఈ కేసులో ఇప్పటివరకూ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అరెస్టైన ముగ్గురిలో కర్నైల్ సింగ్ హర్యానా వాసి కాగా.. శివకుమార్, ధర్మరాజ్ కశ్యప్‌లు ఉత్తరప్రదేశ్‌కి చెందిన వారు. పోలీసుల విచారణలో వీరు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారమని ఇప్పటికే అంగీకరించారు.
సిద్ధిఖీని హత్య చేసేందుకు నిందితులు నెల రోజులుగా రెక్కీ చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. హత్యకు ముందు నిందితులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున అడ్వాన్స్, గన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అందించినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన ముగ్గురు నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. వీరిని రెండు వారాల కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరారు.