
హైదరాబాద్: దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. ఆరు నెలల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పనిచేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలుతున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తున్నాయి. వ్యాయామం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, సినిమా చూస్తూ ఇంకొకరు, కూర్చున్న వారు కూర్చున్నట్టే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తెలంగాణ హైకోర్టులో జరిగింది. కోర్టులో వాదిస్తూనే న్యాయవాది గుండెపోటుతో కుప్పకూలాడు.
Also Read :- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం
గమనించిన కోర్టు సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వివరాల ప్రకారం.. పసునూరి వేణుగోపాల్ అనే సీనియర్ న్యాయవాది మంగళవారం (ఫిబ్రవరి 18) ఓ కేసుకు సంబంధించి తన క్లైయింట్ తరుఫున వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో లాయర్ వేణుగోపాల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి లాయర్లు, కోర్టు సిబ్బంది వేణుగోపాల్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. వాదనలు వినిపిస్తూ కోర్టులోనే గుండెపోటుతో వేణుగోపాల్ మరణించడంతో తోటి లాయర్లు సంతాపం వ్యక్తం చేశారు.