రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న లాయర్లు..

  • అడ్వకేట్ దంపతుల హత్యపై రాష్ట్రవ్యా ప్తంగా ఆందోళనలు
  • డ్యూటీలు బాయ్​కాట్.. రాస్తారోకోలు, ర్యాలీలు
  • సీబీఐ విచారణ చేపట్టాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్

హైదరాబాద్‌, నెట్​వర్క్, వెలుగు: హైకోర్టు అడ్వకేట్ దంపతుల హత్యలపై రాష్ట్రవ్యాప్తంగా లాయర్లు భగ్గుమన్నారు. కోర్టుల్లో డ్యూటీలు బాయ్​కాట్ చేసి రోడ్డెక్కారు. ర్యాలీలు, రాస్తారోకోలు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లాయర్ల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలన్నారు. ఈ హత్యతో సంబంధం ఉన్న వారు ఏ హోదాలో ఉన్నా శిక్షించాల్సిందేనని డిమాండ్​ చేశారు. వామన్‌‌రావు, నాగమణి హత్యకు నిరసనగా హైదరాబాద్​లో లాయర్లు, లా స్టూడెంట్స్‌‌ ఆందోళన చేపట్టారు. హైకోర్టు, ఉస్మానియా యూనివర్సిటీ, రంగారెడ్డి జిల్లా కోర్టుల, నాంపల్లి, సికింద్రాబాద్‌‌ కోర్టుల్లో నిరసనలకు దిగారు. నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో ప్రొటెస్టులు చేశారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్‌‌ చేశారు. ఎల్బీనగర్‌‌‌‌లో నిర్వహించిన ఆందోళనలో ఎమ్మెల్సీ రాంచందర్‌‌‌‌రావు పాల్గొన్నారు. లాయర్లతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఓయూలో లా స్టూడెంట్స్ ర్యాలీ తీశారు. పుట్ట మధు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆర్ట్స్ కాలేజీ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. నారాయణగూడలో ఏబీవీపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో కేశవ్ మెమోరియల్‌‌ కాలేజ్‌‌ నుంచి నారాయణగూడ వైఎంసీఏ వరకు ర్యాలీ నిర్వహించారు.

అన్ని జిల్లాల్లో నిరసనలు

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో మహబూబ్​నగర్, వనపర్తి, గద్వాల, నాగర్​కర్నూలు, నారాయణపేటల్లో లాయర్లు విధులు బాయ్​కాట్ చేశారు. మహబూబ్‌‌నగర్‌‌‌‌లో కోర్టు నుంచి అంబేద్కర్‌‌‌‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

నిజామాబాద్, కామారెడ్డితో సహా ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో లాయర్లు డ్యూటీలు బహిష్కరించి నిరసనలు తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి, ఆలేరు, రామన్నపేట, దేవరకొండ, హుజూర్‌‌నగర్‌‌, కోదాడ కోర్టుల్లో లాయర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. హుజూర్‌‌నగర్‌‌లో ర్యాలీ చేపట్టారు.

సంగారెడ్డి, నారాయణఖేడ్, సదాశివపేటలో లాయర్లు ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మెదక్​, సిద్దిపేట, హుస్నాబాద్​లో ఆందోళనలు చేశారు.

ఖమ్మం జిల్లా కోర్టు నుంచి జడ్పీ సెంటర్ వరకు ర్యాలీ తీశారు. మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరులలో నిరసన ర్యాలీలు నిర్వహించారు.

ఆదిలాబాద్​లో డ్యూటీలు బహిష్కరించి కోర్టు మెయిన్​గేట్​ఎదుట లాయర్లు ధర్నా చేశారు. లాయర్లకు రక్షణ కల్పించాలంటూ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్​కు వినతిపత్రం అందజేశారు. మంచిర్యాలలో కోర్టు ఎదుట మెయిన్​ రోడ్డుపై రాస్తారోకో చేశారు. బెల్లంపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, ఆసిఫాబాద్​లలో డ్యూటీలను బాయ్​కాట్ చేశారు. నిర్మల్​లో కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు.

కరీంనగర్ జిల్లా కోర్టు ఎదుట ధర్నా చేసిన లాయర్లు అక్కడి నుంచి కలెక్టరేట్ దాకా ర్యాలీ తీశారు. పెద్దపల్లి, జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్​లలో నిరసన తెలిపారు. మెట్‌‌పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ హైవే 63ను దిగ్బంధించారు. 40 నిమిషాల పాటు వెహికల్స్​ ఆగిపోయాయి.

ములుగు జిల్లా మంగపేటలోని హేమాచల నర్సింహ ఆలయంలో జరిగే నిత్యాన్నదానానికి వామనరావు, నాగమణి దంపతులు ఐదేళ్లుగా ప్రతి నెల రూ.30 వేల సాయం అందజేస్తున్నారు.  వారికి ఆలయ సిబ్బంది నివాళి అర్పించారు.

For More News..

కరోనా టైమ్​లో ఎడ్యుకేషన్​ లోన్స్​ రికార్డు