- హుస్నాబాద్‌లోని ఐవోసీ బిల్డింగ్ముందు లాయర్ల ధర్నా
హుస్నాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన తెలంగాణ సివిల్ కోర్టుల అమెండ్మెంట్బిల్లుతో పేద కక్షిదారులపై ఆర్థిక భారం పడుతుందని, ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని లాయర్లు డిమాండ్ చేశారు. ఆ బిల్లుతో జూనియర్‌సివిల్‌జడ్జి స్థాయి కోర్టులకు కొన్ని ఆస్తులకు సంబంధించిన కేసులు రాకుండాపోతాయని నిరసిస్తూ గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఐవోసీ బిల్డింగ్ముందు హుస్నాబాద్బార్ అసోసియేషన్ సభ్యులు ధర్నా చేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్అధ్యక్షుడు మురళీమోహన్, సీనియర్ లాయర్లుయాళ్ల శ్రీనివాస్‌రెడ్డి, చిత్తారి హన్మంతు మాట్లాడుతూ..కోర్టుల్లో పెరుగుతున్న పెండింగ్ కేసుల పరిష్కారానికని తెచ్చిన ఈ బిల్లు మరింత సమస్యను తేనుందన్నారు. ప్రస్తుతం ఉన్న జూనియర్ సివిల్ జడ్జీల కోర్టుల విచారణ పరిధిని రూ.20 లక్షల నుంచి రూ. 10 లక్షలకు తగ్గిస్తూ అసెంబ్లీలో బిల్లును అమోదించిందన్నారు. దీంతో రూ. 10 లక్షలకు మించిన విలువ గల ఆస్తులకు సంబంధించిన కేసుల వివాదాల పరిష్కారానికి కక్షిదారులు ఇకపై సబ్ కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు.