దయనీయ స్థితిలో లక్సెట్టిపేట జూనియర్​ కాలేజీ 

  • పెచ్చులూడుతున్న స్లాబ్​, పగుళ్లు తేలిన గోడలు  
  • కూలుతున్న బిల్డింగ్​లో భయం నీడన చదువులు 
  • 18 గదుల్లో 11 శిథిలం.. పనికొస్తున్నవి ఏడే  
  • 660 మందికి క్లాస్​లు, ల్యాబ్​లు అందులోనే..  
  • కొత్త బిల్డింగ్​ కోసం ఐదేండ్లుగా స్టూడెంట్ల పోరాటం

మంచిర్యాల,వెలుగు : ఆ బిల్డింగ్​ కట్టి 55 ఏండ్లు కావస్తున్నది. ఇప్పటికి 50 ఏండ్లు దాటడంతో బాగా పాతబడ్డది. స్లాబ్​ పెచ్చులూడుతున్నది. గోడలు కూలుతున్నయ్​. వానొస్తే రూములు కురుస్తున్నయ్​. గ్రౌండ్​ చిన్నపాటి చెరువైతున్నది. మొత్తం 18 రూములు ఉంటే... ఏడే పనికొస్తున్నయ్​. అందులోనే 660 మంది స్టూడెంట్లకు క్లాస్​లు చెప్తున్నరు. ల్యాబ్​లు నడిపిస్తున్నరు. స్టాఫ్​ రూం, ప్రిన్సిపల్​ చాంబర్​ అధ్వానంగా ఉన్నయ్​. ఎప్పుడు ఏ పెళ్ల రాలి మీద పడ్తతోనని భయపడుతున్నరు. కూలుతున్న బిల్డింగ్​లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నరు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట ప్రభుత్వ జూనియర్​ కాలేజీ దుస్థితి ఇది.  

1968లో నిర్మాణం.. 

పట్టణ నడిబొడ్డున విశాలమైన స్థలంలో కాలేజీ ఉన్నప్పటికీ భవనం మాత్రం పాతది. ఈ బిల్డింగ్​ను 1968లో నిర్మించారు. 55 ఏండ్ల కిందటిది కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆ తర్వాత నిర్మించిన బిల్డింగ్​ సైతం బలహీనంగా మారింది. మొత్తం 18 రూములకు 11 శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం ఏడు రూంలలోనే క్లాస్​లు నిర్వహిస్తున్నారు. ప్రిన్సిపాల్ చాంబర్​తో పాటు స్టాఫ్ రూం ఉరుస్తున్నాయి. వానాకాలంలో కనీసం కూర్చునే పరిస్థితి లేదు. కొన్ని రూంల పై కప్పులు, స్లాబ్​లు కూలిపోయాయి. గోడలు పెచ్చులూడిపోయి ప్రమాదకరంగా మారాయి. ఫ్యాన్లు ఎప్పుడు ఊడిపోయి మీదపడుతాయోనని కంగారు పడుతున్నారు. కరెంట్​ వైర్లు బయటకు వేలాడుతున్నాయి. వర్షాకాలంలో స్లాబ్​, గోడలు తడిసిపోయి షార్ట్​ సర్క్యూట్​తో మంటలు లేచిన సందర్భాలు ఉన్నాయి. తరచూ కంప్యూటర్లు, ఫ్యాన్లు, లైట్లు పాడవుతున్నాయి. వేల రూపాయలు పెట్టి రిపేర్లు చేయించలేకపోతున్నారు.  

భయం నీడన చదువులు...

శిథిలావస్థకు చేరిన బిల్డింగ్​లో స్టూడెంట్లు భయం నీడన చదువులు కొనసాగించాల్సి వస్తోంది. ఈ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్​, సెకండియర్​లో కలిపి జనరల్ నాలుగు గ్రూపులు, ఒకేషనల్ మూడు గ్రూపులు ఉన్నాయి. మొత్తం 650 మంది స్టూడెంట్లు, 30 మంది స్టాఫ్​ ఉన్నారు. పట్టణం నడిమధ్యలో బస్టాండ్​ పక్కన  స్టూడెంట్ల రాకపోకలకు అందుబాటులో ఉన్నప్పటికీ కనీస సౌలత్​లు లేక కొట్టుమిట్టాడుతున్నారు. టాయ్​లెట్లు రెండు పాతవి, రెండు కొత్తవి ఉన్నాయి. ఇవి అంత మందికి సరిపోవడం లేదు. దీంతో బాలురు ఒంటికి రెంటికి బయటికి పోతున్నారు. వానాకాలంలో గ్రౌండ్​లో నీళ్లు నిలిచి చెరువును తలపిస్తోంది. పాములు, విషపురుగులు తిరుగుతున్నాయి. శిథిలావస్థలో ఉన్నభవనంతో ఏదైనా ప్రమాదం జరిగితే అప్పడు స్పందిస్తారా అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఐదేండ్లుగా పోరాడుతున్న స్టూడెంట్లు...

జూనియర్​ కాలేజీకి కొత్త బిల్డింగ్​ నిర్మించాలని స్టూడెంట్లు దాదాపు ఐదేండ్ల నుంచి పోరాడుతున్నారు. ఎస్​ఎఫ్​ఐ, ఇతర స్టూడెంట్​ యూనియన్ల ఆధ్వర్యంలో పలుమార్లు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తాకోరోలు నిర్వహించినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.  అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన శూన్యం. రెండు నెలల కిందట జిల్లా పర్యటనకు వచ్చిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎస్​ఎఫ్​ఐ నాయకులు కాలేజీ పరిస్థితిని వివరించి మెమోరాండం ఇచ్చినప్పటికీ ఫలితం లేదు. కాలేజీ గ్రౌండ్​లో డీఎంఎఫ్​టీ నిధులతో మినీ స్టేడియం నిర్మాణం పేరిట కమర్షియల్​ షట్టర్లు కడుతున్నారు. కానీ కళ్లముందే ఉన్న కాలేజీ దుస్థితి ప్రజాప్రతినిధులు, అధికారులకు కనిపించకపోవడం శోచనీయం. పట్టణం నడిబొడ్డున ఉన్న కాలేజీని ఊరు బయటకు తరలించి ఇక్కడ కమర్షియల్​ కాంప్లెక్స్​లు నిర్మించేందుకు సైతం కొంతమంది కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం...

కాలేజీ బిల్డింగ్​ శిథిలావస్థలో ఉంది. స్లాబ్​ పెచ్చులూడుతోంది. గోడలు పగుళ్లు తేలాయి. వర్షాకాలం గ్రౌండ్​లో నీళ్లు నిలుస్తున్నాయి. ఏడు రూంలలోనే క్లాస్​లు, ల్యాబ్​లు నిర్వహిస్తున్నాం. పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కొత్త బిల్డింగ్​ నిర్మించాలని కోరాం. సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. -  శైలజ, కాలేజీ ప్రిన్సిపాల్​ (డీఐఈవో)

దండేపల్లిలో రూంల కొరత... 

దండేపల్లిలో కూడా జూనియర్ కాలేజీకి బిల్డింగ్​ లేదు. హైస్కూల్ ఆవరణలో కాలేజీకి ఆరు రూంలు కేటాయించారు. అవి సరిపోకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలోని నెల్కివెంకటాపూర్​ ప్రైమరీ స్కూల్​లో స్టూడెంట్లు తక్కువగా ఉన్నారు. వీళ్లను దండేపల్లి హైస్కూల్​కు తరలించి ఆ బిల్డింగ్​ను జూనియర్​ కాలేజీకి కేటాయించాలని కోరుతూ అధికారులు విద్యాశాఖకు లెటర్​ రాశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్కూల్​ బిల్డింగ్​ను కాలేజీకి కేటాయించాలని కోరుతున్నారు.