కాంగ్రెస్లో ఎంతో మంది జాతీయ నాయకులు ఉన్నా పాలమూరు జిల్లాకు చేసింది శూన్యమని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 8 ఏళ్లలో 12 మెడికల్ కళాశాలల ఏర్పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతోనే సాధ్యమయ్యిందని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్లో వెయ్యి పడకల ఆధునిక ఆస్పత్రికి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. నర్సింగ్ కళాశాలకు రూ.50 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. పాలమూరు జిల్లాలో క్యాథలాబ్, క్యాన్సర్ విభాగాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
జిల్లాకు బీఎస్సీ పారమెడికల్ కళాశాల మంజూరు చేసి 6 కోర్సులకు ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీల్లో 969 వైద్యులకు పోస్టింగులు ఇస్తామన్నారు. అలాగే.. జనరల్ ఆస్పత్రి, బోధనాస్పత్రిలో 1146 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని హరీష్ పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని ఆయన అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. కేంద్రంలో బీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర వహిస్తుందన్నారు. తెలంగాణ పై కేంద్రానికి ప్రేమ ఉంటే కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చాలన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేస్తోందని ఆయన ఫైర్ అయ్యారు.