- మూడు నెలల్లో అప్లికేషన్ల ప్రాసెస్ పూర్తి
- ప్లాట్లపై మూడు దశల్లో, లే అవుట్లపై నాలుగు దశల్లో పరిశీలన
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,15,329 దరఖాస్తులు పెండింగ్
- ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న వ్యాపారులు
ఖమ్మం, వెలుగు: అప్లికేషన్లు తీసుకున్న నాలుగేళ్ల తర్వాత లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులకు మోక్షం లభిస్తోంది. ఎట్టకేలకు ఎల్ఆర్ఎస్అప్లికేషన్లను పరిశీలించి, అర్హత కలిగిన లే అవుట్లు, ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై రియల్ఎస్టేట్వ్యాపారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు అనుమతి లేని వెంచర్లలో ప్లాట్ల అమ్మకాలు నిలిచిపోవడంతో, పెద్ద మొత్తంలో ఆ వెంచర్లపై పెట్టుబడి పెట్టిన వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.
1,15,329 దరఖాస్తులు..
2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు తీసుకోగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,15,329 దరఖాస్తులు వచ్చాయి. సొంతంగా దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు రూ.1000 చొప్పున, వెంచర్లకు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న లే అవుట్ల ఓనర్లు రూ.10 వేల చొప్పన ప్రభుత్వ ఖజానాకు డబ్బులు చెల్లించారు. వచ్చిన దరఖాస్తుల్లో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోనే ఏకంగా 51,395 అప్లికేషన్లు వచ్చాయి. ఇతర మున్సిపాలిటీలు, గ్రామాల్లో కలిపి మిగిలిన అప్లికేషన్లున్నాయి. లే అవుట్లకు అప్రూవల్స్ లేకుండా ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయొద్దని అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో అప్పుడు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
అదే ఏడాది డిసెంబర్ లో జీవోలో పలు సవరణ చేస్తూ, గతంలో ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన వాటికి, గ్రామకంఠం పరిధిలో ఉన్న ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేయొచ్చని మరో సర్క్యులర్ జారీ చేశారు. అప్పటి నుంచి లే అవుట్ల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకుని, ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించినట్టయింది. కోర్టు కేసులు, ఇతర వివాదాల కారణంగా గత నాలుగేళ్లలో ప్రభుత్వం ఈ దరఖాస్తులను పెండింగ్ లోనే ఉంచింది.
ఇన్నాళ్లు రూ.కోట్లల్లో నష్టం..
పర్మిషన్లు లేని వెంచర్లు, ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల అమ్మకాలు కొనుగోళ్లు జరగకపోవడంతో చాలా మంది వ్యాపారులు రూ.కోట్లలో నష్టపోయారు. రూ.కోట్లు పెట్టుబడి పెట్టి వెంచర్లు వేసిన తర్వాత, ల్యాండ్ కన్వర్షన్లు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో అప్పులపాలై ఆందోళన చెందుతున్నవారున్నారు. జిల్లాకో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి, పటిష్టంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని, మూడు నెలల్లోపు అప్లికేషన్లను పరిశీలించి, ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించడంతో, నాలుగేళ్లుగా నిలిచిన అమ్మకాలు, కొనుగోళ్లు మళ్లీ ఊపందుకుంటాయని రియల్ఎస్టేట్వ్యాపారులు భావిస్తున్నారు.