- జిల్లా లో ఐదు మున్సిపాలిటీ ల్లో 27, 369 అప్లికేషన్లు
- ఇందులో 2 వేల ఫ్లాట్స్ ప్రొహిబిటెడ్ లిస్టు లోనివే
- చెరువు, బఫర్, శిఖం భూములను వదలని అక్రమార్కులు
- మూడు డిపార్ట్మెంట్ల ఫీల్డ్ సర్వే తో అక్రమాలకు చెక్
జగిత్యాల, వెలుగు: ఇల్లీగల్ గా లే అవుట్లు వేసి విక్రయించిన ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. అయితే రెగ్యులర్ ల్యాండ్ తో పాటు ప్రొహిబిటెడ్ ల్యాండ్ కోసం కూడా అప్లికేషన్లు వచ్చాయి. ఈ ఎల్ఆర్ఎస్ ను ఆసరాగా చేసుకున్న కొందరు ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ను క్రమబద్ధీకరించుకునేందుకు ప్లాన్ వేశారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో, బఫర్ జోన్ పరిధి లో, ఇతర నిషేధిత ప్రాంతం లోని ప్లాట్లు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు.
రెండు వేలకు పైగా అప్లికేషన్లు..
జగిత్యాల జిల్లా లోని ఐదు మున్సిపాలిటీల్లో 27, 369 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ కు చెందిన 2,016 అప్లికేషన్లు ఉన్నాయి. ధర్మపురిలో 31, జగిత్యాల లో 9, కోరుట్లలో 1538, మెట్‌పల్లిలో 311, రాయికల్‌లో 127 అప్లికేషన్లు ప్రోహిబిటెడ్ ల్యాండ్ కు చెందినవిగా ఆఫీసర్లు గుర్తించారు. ఎల్ఆర్ఎస్ వర్తించని ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ ఆన్ లైన్ లో సర్వే నెంబర్ల తో సహా చూపించడం తో అక్రమార్కుల ప్లాన్ కు అడ్డుకట్ట పడింది. గ్రామాల్లో ముందుగా ఎల్ వన్ స్టేజ్ లో జీపీ సెక్రటరీ, ఇరిగేషన్ ఎఈ, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ లు పరిశీలిస్తున్నారు.
ఎల్ టు స్టేజ్ లో డిస్ట్రిక్ పంచాయతీ ఆఫీసర్, ఎల్ త్రీ స్టేజ్ లో జిల్లా అధికారి పరిశీలిస్తారు. మున్సిపాలిటీల్లో ఏల్ వన్ స్టేజ్ లో వార్డు ఆఫీసర్, రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు ఎల్ టూ స్టేజ్ లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎల్ త్రీ లో మున్సిపల్ కమిషనర్ పరిశీలించి ఆమోదించనున్నారు. సరైన డాక్యు మెంట్ల తో పాటు లింకు డాక్యుమెంట్లు, స్థలాలు ఎక్కడున్నాయో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
మార్కెట్ రేట్ కడితే రెగ్యూలరైజేషన్..
2020 ఆగస్టు 28 వరకు ఇల్లిగల్ రిజిస్టర్ చేసుకున్న ఇళ్ల స్థలాలకు అప్లికేషన్ ఫీజు తో పాటు, మార్కెట్ విలువ ప్రకారం చెల్లించి రెగ్యులరైజ్ చేసుకునేందుకు గత సర్కార్ అవకాశం కల్పించింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలకు ఆనుకుని బఫర్ జోన్ ప్రాంతాలు, శిఖం భూములు, తదితర స్థలాలు నిషేధిత భూములుగా గుర్తించి ఆయా లేఅవుట్ల లోని ప్లాట్లకు క్రమబద్ధీకరణ చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నిజమైన అర్హులను గుర్తించేందుకు సర్వే లో బల్దియా తో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లలతో టీంలను ఏర్పాటు చేయడం తో అక్రమార్కులకు చెక్ పడింది. ఫిబ్రవరి 1 లోపు అప్లికేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు.