- అది బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభమైంది: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
బషీర్ బాగ్,- వెలుగు: మూసీ ప్రాజెక్ట్‌కు తాము వ్యతిరేకం కాదని.. కానీ, అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు న్యాయం చేయాలని ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. ఆ ప్రాంతంలో సుమారు 30 దళిత కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. 15 రోజుల్లో ఇండ్లు కూల్చేస్తామంటూ అధికారులు భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం 2013ను అమలు చేయాలని కోరుతూ పలువురు దళిత కుటుంబాలతో కలిసి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను సుధీర్ రెడ్డి కలిశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్లోని లక్ష్మి నరసింహ కాలనీ వాసులతో కలిసి ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడారు.
‘‘మూసీ బాధిత కుటుంబాలన్నీ పట్టా భూమిలో ప్రభుత్వ అనుమతితో ఇండ్లు కట్టుకున్నాయి. కానీ.. ఇప్పుడు వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపడం లేదు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. కేసీఆర్ రూ.3,800 కోట్లు కేటాయించారు. బాధితులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు అండగా ఉంటది’’అని సుధీర్ రెడ్డి భరోసా ఇచ్చారు.