
- చావు భయంతోనే చంపేశారు
- హత్యకు స్నేహితుల మధ్య ఉన్న పాత కక్షలే కారణం
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్ శివగంగ కాలనీలో ఈ నెల 22న అర్ధరాత్రి జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షల నేపథ్యంలో బొడ్డు మహేశ్ ను గొడ్డళ్లు, కొడవళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు తేల్చారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గతంలో మృతుడు బొడ్డు మహేశ్ అతని స్నేహితుడు పగిళ్ల పురుషోత్తంకు జరిగిన చిన్న చిన్న గొడవలు పెరిగిపోయి హత్యకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు.
గతంలో పురుషోత్తంపై హత్యాయత్నం చేయించిన మహేశ్ ఇటీవల జైలు నుంచి తన స్నేహితులతో కలిసి బయటకు వచ్చాడు. దీంతో విషయం తెలుసుకున్న పురుషోత్తం తనను ఎలాగైనా మహేశ్ చంపుతాడని భావించి హత్య చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పురుషోత్తం తన స్నేహితులతో కలిసి మహేశ్ హత్యకు స్కెచ్ వేశాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి బైక్పై వెళ్తున్న మహేశ్ ను కారుతో ఢీకొట్టి కింద పడిన అనంతరం గొడ్డళ్లు, కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు.
ఈ ఘటనపై మహేశ్ సోదరి మౌనిక ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మీర్ పేట్ నందిహిల్స్ లో నివాసం ఉండే పగిళ్ల పురుషోత్తం, భరత్ నగర్ కాలనీకి చెందిన నోముల నాగార్జున, మంద సందీప్, సికింద్రాబాద్ తుకారాం గేట్ చెందిన గడమోని రాము, మలక్ పేట్ శంకర్ నగర్ కు చెందిన రాకేశ్ అలియాస్ చింటూ, మేడ్చల్ వివేకానంద నగర్ కు చెందిన కుంచల ఓంకార్ ను అరెస్ట్ చేశారు. రాము కారు నడుపుతూ మహేశ్ వెళ్తున్న బైక్ ను ఢీకొట్టగా, పురుషోత్తం, నాగార్జున, సందీప్ లు దారుణంగా కొడవళ్లు, గొడ్డళ్లతో హత్య చేసినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని రాచకొండ సీపీ సుధీర్ బాబు అభినందించారు.