హైదరాబాద్,వెలుగు: రూ.2 వేల నోట్లు రద్దు చేస్తున్నారని నమ్మించి రూ.2 కోట్లు కొట్టేసిన నలుగురు సభ్యుల గ్యాంగ్‌ను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసు వివరాలను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన షేక్ రోషన్ మెహబూబ్(40) గతంలో చీటింగ్ కేసులో జైలుకెళ్లి వచ్చాడు. రూ.2 వేల నోట్ల రద్దు చేస్తున్నారంటూ కొంతకాలంగా మోసాలకు పాల్పడుతు న్నాడు. ఇందుకోసం సన్‌సిటీలోని హిమగిరి కాలనీకి చెందిన కొలంపల్లి శ్రీనివాస్(45), ఉప్పల్‌లోని భరత్‌నగర్‌కు చెందిన బింగి వాసు(44), ఎల్బీనగర్కు చెందిన సింగమశెట్టి రాములు(40)తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు.
కొన్నిరోజుల కిందట సంతోష్‌నగర్ రక్షపురం కాలనీకి చెందిన వ్యాపారి ఎదులకంటి ప్రభాకర్ గౌడ్‌కు మెహబూబ్ తో పరిచయం ఏర్పడింది. తాను హోటల్ బిజినెస్ చేస్తానని మెహబూబ్ అతడితో చెప్పాడు. కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్లను తొందరలోనే రద్దు చేస్తుందని, తమ వద్ద పెద్ద మొత్తంలో ఆ నోట్లు ఉన్నా యని..వాటిని రూ.500తో ఎక్స్చేంజ్ చేస్తే రూ.20 శాతం కమీషన్ ఇస్తామని ప్రభాకర్‌ను నమ్మించాడు. మెహబూబ్ చెప్పిన విధంగా ప్రభాకర్ రూ. 500 నోట్లను కలెక్ట్ చేసుకున్నాడు. 20 శాతం కమీషన్ వస్తుందనే ఆశతో ఫ్రెండ్స్,బంధువుల వద్ద రూ.500 నోట్లు.. కోటి 90 లక్షలు కలెక్ట్ చేశాడు.
మెహబూబ్ గ్యాంగ్ చెప్పిన విధంగా ప్రభాకర్ డబ్బు తీసుకుని శనివారం ఉదయం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కు వచ్చాడు. డబ్బును వారికి అందించాడు. దీని గురించి సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు అక్కడికి చేరుకుని మెహబూబ్‌తో పాటు అతడి గ్యాంగ్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రూ. కోటి 90 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీపీ చౌహాన్ తెలిపారు.