హైదరాబాద్ ఎల్బీనగర్ లో వరలక్ష్మీ అనే మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేదే లేదని పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. వరలక్ష్మీని ఎస్సీతో పాటు..మరో ముగ్గురు కానిస్టేబుళ్లు చిత్ర హింసలకు గురి చేస్తే..ఉన్నతాధికారులు మాత్రం ఇద్దరిపైనే చర్యలు తీసుకున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఘటన జరిగిన రోజు నైట్ డ్యూటీలో ఉన్న ఎస్సైతో పాటు, మరో కానిస్టేబుల్ పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే..
మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4లో వరలక్ష్మీ అనే మహిళ నివాసం ఉంటోంది. అయితే తన కూతురి పెళ్లి కోసం సరూర్‌నగర్‌లోని బంధువుల ఇంటికి డబ్బులు కోసం వెళ్లింది. అనంతరం ఆగస్టు 15న అర్థరాత్రి తిరిగి ఎల్బీనగర్‌కు వస్తుండగా.. ఎల్బీనగర్ సర్కిల్లో వరలక్ష్మిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత వరలక్ష్మీని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించినా పోలీసులు కారణం చెప్పలేదు. పోలీసులు తమ వాహనంలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ మహిళను చిత్ర హింసలకు గురి చేశారు. ఆమెపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. బాధితురాలు ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినందుకు మరిన్ని చిత్రహింసలకు గురి చేశారు పోలీసులు. అయితే ఆగస్టు 16వ తేదీ తెల్లవారుజామున ఓ పోలీసు అధికారి ఆదేశాల మేరకు వరలక్ష్మీని పోలీసులు వదలిపెట్టారు. పోలీసులు దాడిలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. కనీసం నడవలేని స్థితికి చేరుకుంది. ఆ తర్వాత ఎలాగోలా ఇంటికి చేరింది.
ఎల్బీనగర్ పోలీసులు తనను అకారణంగా అరెస్ట్ చేశారని బాధితురాలు వరలక్ష్మీ పేర్కొంది. ఎందుకు తనను అరెస్ట్ చేశారో కూడా కారణం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే ..ఏ తప్పు చేయని తనను పోలీసులు అరెస్ట్ చేసి..చిత్ర హింసలకు గురి చేసి కొట్టారని బాధితురాలు తీవ్రంగా రోధించింది. వరలక్ష్మీ పట్ల ఎల్బీనగర్ పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు ఈ ఘటనపై రాచకొండ సీపీ చౌహాన్ స్పందించారు. మహిళను అకారణంగా అరెస్ట్ చేసి చిత్ర హింసలకు గురి చేసిన ఇద్దరు పోలీసులపై వేటు వేశారు. మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేశారు. మహిళపై దాడి ఘటనపై విచారణ చేశారు. అనంతరం ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.