రాజకీయాలు తెలియని లీడర్​ నాయిని

నాయిని నరసింహారెడ్డి ఏ హోదాలో ఉన్నా కార్మిక నేతగానే బతికిర్రు. సమస్య ఉందని ఎవరెళ్లినా పరిష్కరించేవారు. ఏ పని అయితది.. ఏది కాదు అని నిర్మొహమాటంగా చేప్పేవారు.  ఆయన తెలంగాణ తొలి హోం మంత్రి అయ్యాక కొద్ది రోజులకే పోలీసులకు అడిషనల్ హెర్ఆర్​ఏ తీసేస్తూ జీవో వచ్చింది.  అది పోలీసుల్లో అలజడికి కారణమైంది. మేం నాయిని దగ్గరికెళ్లాం. ఇదేంది సార్ తెలంగాణ రాంగనే మాకు అన్యాయం జరిగితే ఎట్టా అని అడిగినం. ఆయన అదేంది అట్టెట్టా జరుగుద్ది. మీకసులు అడిషనల్ హెచ్ఆర్ఏ లేకుండెనేమో అన్నడు. ఆయనకు వివరంగా చెప్పగానే డీజీపీకి ఫోన్ చేశారు. మమ్మల్ని వెళ్లి ఫైనాన్స్ మినిస్టర్ తో కలవమని చెప్పి ఓఎస్డీని ఫాలో అప్ చేయమన్నారు. ఆయన కింది స్థాయి ఇబ్బందిని పసిగట్టే తీరు చూసి మాకు ఆశ్చర్యం వేసింది.

పాజిటివ్​గా స్పందించారు

ఒక వారం తర్వాత మళ్లీ హోంమంత్రి ఇంటికి వెళ్లాం. అడిషనల్ హెచ్ఆర్ఏ గురించి గుర్తు చేస్తే ఇంకా రాలేదా అని వెంటనే ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. మమ్మల్ని ఆయన ఇంటికెళ్లమని చెప్పారు. మేము ఈటలను కలిస్తే సెక్రటేరియట్​కు రమ్మన్నరు. కానీ, బయట మీటింగులు ఉండడంతో ఈటల అక్కడికి రాలేదు. మేం సాయంత్రం 6 గంటల దాకా చూసి మళ్లీ నాయిని ఆఫీసుకు వెళ్లాం. ఈటల ఆఫీసుకు రాలేదని చెప్పడంతో  ఫోన్ చేశారు. ‘మనం మీటింగుల పేరు మీద వాళ్లని ఇబ్బంది పెడితే ఎలా, మన ఎమ్మటుండే పోలీసుల ఇబ్బందులను మనమే చూడాలిగదా’ అని సరదాగా అన్నారు. వెంటనే స్పందించిన ఈటల అడిషనల్ హెచ్ఆర్ఏను పునరుద్ధరిస్తూ జీవో ఇచ్చారు. ఆయన పాజిటివ్ గా స్పందించకపోతే ఆ హెచ్ఆర్ఏ ఎప్పటికి వచ్చేదో చెప్పలేము.

ముక్కుసూటి మనస్తత్వం

ఎవరు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా ‘అరే, ఇది ఎట్ట అయిద్ది, సీఎం దీనికి ఒప్పుకుంటరా’ అని మొహం మీదనే అనేటోడు. తరువాత మానవత్వంతో స్పందించి ఓకే చేసేవారు. ఓసారి హోంగార్డుల సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మీటింగు అవుతుంది. ఆడిటోరియం నిండా జనం ఉన్నారు. అప్పటి హోంగార్డుల గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కూడా వేదిక మీద ఉన్నారు. హోంగార్డులు ఒక మెమోరాండం ఇచ్చారు. రిప్రజెంటేషన్ సాంతం చదివి ‘ఇగో సీఎం వీటిని ఒప్పుకుంటరు, ఇది ఒప్పుకోక పోవచ్చు’ అని చెప్పిండు. ఇంకెవరైనా అయితే ‘సరే చూద్దాం’ అని పంపేసేవారేమో. కానీ, ఆయనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు. ఆ మీటింగు వల్ల కార్మికులతో పాటు హోంగార్డులకు కూడా 5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు వచ్చింది. వేతనాలు కూడా పెరిగాయి.

కన్ఫామ్​ చేసుకున్నాకే పని

ఒకసారి రైల్వే పోలీసుల ఇబ్బందుల గురించి నాయిని దగ్గరకు వెళ్తే వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడి పని అవుతుందని హామీ ఇచ్చారు. మర్నాడు రైల్వే అధికారులు ఆయన్ని కలిశారు. వాళ్లేం చెప్పారోగానీ ఆయన నాకు ఫోన్ చేసి ‘మీరు చెప్పింది నిజమేనా’ అని అడిగారు. ‘నా మాటలకు 100% కట్టుబడి ఉంటాను’ అని చెప్పడంతో రైల్వే అధికారుల మాటలను ఆయన నమ్మలేదు. ఏదైనా వినతిపత్రం ఇస్తే ఆయన కన్ఫామ్ చేసుకున్నాకే పని చేసేవారు. క్రమశిక్షణ చర్యలను ఎత్తేయించుకోవడానికి ఎవరైనా వచ్చారంటే అప్పటికే వారు ఎంత బాధపడి ఉంటారో అనే మానవతా దృక్పథం నాయినికి ఉండేది. ఉద్దేశ్యపూర్వకంగా చేసిన తప్పులను క్షమించేవారు కాదు. ఒక కానిస్టేబుల్ స్థితిని చూసి, చలించి, ‘నీ ఆర్డర్ ఇంటికే పంపిస్తా మళ్లీ ఛార్జీలు బెట్టుకొని రామాకు’ అని చార్జీకి డబ్బులిచ్చి పంపించారు. వందల మంది కార్మికులకు కూడా నాయిని సాయం చేశారు.

ఆయనో అజాత శత్రువు

నాయిని ప్రత్యేక వ్యక్తిత్వం కలిగిన అజాత శత్రువు. సెక్రటేరియట్ నుంచి అందరి కంటే చివర వెళ్లే మంత్రి నాయిని. జనాభిప్రాయంలో ఉన్నట్టుగానే ఆయన చాలా మమకారం ఉన్న మనిషి. అందరికీ ప్రేమను పంచిండు. నమ్మిన వారి పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలో నేర్పిండు. రాజకీయంలో ఎత్తుగడ, వ్యూహం లాంటి మూస లక్షణాలు లేని ఏకైక లీడర్ ఆయన. పంచె కట్టి బుల్లట్ ను నడిపే స్వచ్చమైన తెలంగాణ వాసి, వాది.

మా పోలీసు డిపార్టుమెంటు మొత్తానికి హోంమంత్రిగా నాయిని ఎనలేని గౌరవం ఇచ్చేవారు. ‘మా డీజీపీ బాగా కష్టపడుతుండు’ అనేవారు. ప్రతి సందర్భంలోనూ పోలీసు వ్యవస్థను వెనకేసుకొచ్చే వారు. మమ్ముల్ని కూడా కార్మికులుగానే గుర్తించాడు. అందుకే మా పట్ల సానుభూతి ఉందనుకుంటా. అర్ధరాత్రి వెళ్లినా పలికేవారు. ప్రతి మనిషి పట్ల వారి గుండెల్లో ఉన్న తడి కనిపిస్తూనే ఉండేది. మా పోలీసులందరి గుండెల్లో నాయిని  జ్ఞాపకం ఆరని తడిగా కలకాలం ఉంటుంది.

– వై.గోపిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ పోలీసు అధికారుల సంఘం

For More News..

బీహార్‌లో నితీశ్‌ను మోడీ కాపాడగలరా?

దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రచారం!

ఉల్లిగడ్డ మస్తు తింటున్నం.. ఒకప్పుడు ఏటా 2 కేజీలు తింటే.. ఇప్పుడు 14 కేజీలు