న్యూఢిల్లీ: అమెరికాలో కేసు నమోదైన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీని వెంటనే అరెస్టు చేయాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పిస్తోందని ఆయన విమర్శించారు. బుధవారం పార్లమెంట్ బయట రాహుల్ మీడియాతో మాట్లాడారు. దేశంలో చిన్న, చిన్న ఆరోపణలు వస్తేనే వందలాది మందిని అరెస్టు చేసినప్పుడు.. అదానీ ఎందుకు జైలులో లేరని ఆయన ప్రశ్నించారు. లంచం కేసులో యూఎస్ అధికారులు కోర్టులో దాఖలు చేసిన అభియోగపత్రంలో అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) ఉల్లంఘనలకు పాల్పడలేదని అదానీ గ్రూప్ ప్రకటించిన అనంతరం రాహుల్ స్పందించారు. "అదానీలు ఆరోపణలను అంగీకరించబోతున్నారని మీరు అనుకుంటున్నారు.
మీరు ఏ ప్రపంచంలో నివసిస్తున్నారు? స్పష్టంగా, అతను ఆరోపణలను తిరస్కరించబోతున్నాడు" అని అదానీపై ఆరోపణలను అతని గ్రూప్ తిరస్కరించడం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు రాహుల్ సమాధానమిచ్చారు. అంతకుముందు, అదానీ తరఫు అడ్వకేట్ ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ, వ్యాపారవేత్త లేదా అతని సహచరులపై నిర్దిష్ట ఆరోపణలు లేవు, లంచం ఆరోపణలు చాలా సాధారణమైనవి ఎవరు ఎవరికి లంచం ఇచ్చారనే దానిపై నిర్దిష్టంగా పేర్కొనబడలేదని పేర్కొన్నారు. కాగా, రోహత్గీ వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీ తోసిపుచ్చింది.
అలాగే, అదానీపై వచ్చిన లంచం ఆరోపణల తీవ్రతను పలచన చేసేందుకు మోదానీ ఎకోసిస్టమ్ ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అదానీపై వచ్చిన ఆరోపణలపై పార్లమెంట్లో వివరంగా చర్చించాలని, దర్యాప్తు సంస్థలతో పాటు సెబీ ఈ ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.