పేదల గోడు పట్టించుకోవట్లే : మోదీ సర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్

పేదల గోడు పట్టించుకోవట్లే : మోదీ సర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్

చండీగఢ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొద్ది మంది బిలియనీర్ల కోసమే పనిచేస్తున్నదని కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ ​గాంధీ అన్నారు. దేశంలోని పేదలు, దళితుల గోడు పట్టించుకోవట్లేదని, వారు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని విమర్శించారు. కేవలం 25 మంది కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిన ప్రధాని మోదీ.. దేశంలోని కోట్లాది మంది రైతులు, మహిళలకు పైసా కూడా మాఫీ చేయలేదన్నారు. ఆరెస్సెస్ తన వ్యక్తులను దేశ వ్యవస్థల్లో చొప్పించి రాజ్యాంగంపై దాడిచేస్తున్నదని ఆరోపించారు. 

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారంలో సోనిపట్​లో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో కొద్ది మంది బిలియనీర్లు, కార్పొరేట్ల మేలు కోసమే పనిచేస్తున్నది. దేశంలోని పేదలు, రైతులు, యువత, దళితుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, ఆయా వర్గాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి” అని రాహుల్​ అన్నారు. ఈ సభకు వస్తుంగా ఒక వ్యక్తి కలిసి తన గోడు చెప్పుకున్నాడు. అదానీ, అంబానీల మేలు కోసం పెద్దనోట్ల రద్దు (డీమానిటైజేషన్), తప్పుడు జీఎస్టీ అమలు చేసిన మోదీ తన లాంటి చిరు వ్యాపారులెందరో బతుకులను నాశనం చేశాడని వాపోయాడన్నారు. గతంలో హర్యానాలో చిన్న, మధ్యతరగతి వ్యాపారాలు ఎంతో మందికి ఉపాధి కల్పించేవి ఇప్పుడవన్నీ మూతపడ్డాయన్నారు.