కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం కొట్లాడ్తం కేంద్రంపై ఒత్తిడి తెస్తం: రాహుల్

జమ్మూ : జమ్మూకాశ్మీర్​కు రాష్ట్ర హోదా కోసం కొట్లాడతామని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఇందుకోసం ఇండియా కూటమి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పారు. ‘‘అసెంబ్లీ ఎన్నికలకు ముందే జమ్మూకాశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. కానీ బీజేపీ అందుకు ఒప్పుకోలేదు. మొదట ఎలక్షన్స్ నిర్వహించి, ఆ తర్వాత రాష్ట్ర హోదాపై చర్చిద్దామని చెప్పింది. 

మేం ఎట్టి పరిస్థితుల్లోనూ జమ్మూకాశ్మీర్ కు అన్యాయం జరగనివ్వం. ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర హోదా కోసం కొట్లాడుతాం. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించి తీరుతాం” అని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్​లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్ బుధవారం అక్కడ పార్టీ ప్రచారం ప్రారంభించారు. రాంబన్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. 

రాజులాగా ఎల్జీ వ్యవహరిస్తున్నడు.. 

ఒక రాష్ట్రం తన రాష్ట్ర హోదాను కోల్పోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని రాహుల్ గాంధీ చెప్పారు. ‘‘గతంలో కేంద్రపాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చారు. కానీ రాష్ట్రాలను యూటీలుగా ఎప్పుడూ మార్చలేదు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రహోదాను వెంటనే తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది కేవలం రాష్ట్ర హోదాతో పాటు ప్రజల హక్కులు, సంపదను కూడా కోల్పోయింది” అని అన్నారు. 

లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) రాజులాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘‘మనకు 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. అప్పుడు రాజుల పాలన పోయింది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు జమ్మూకాశ్మీర్​లో ఎల్జీ పేరుతో ఒక రాజు పాలన చేస్తున్నారు. ఇక్కడి ప్రజల సంపదను దోచుకుంటున్నారు. బయటి నుంచి వచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. అందుకే జమ్మూకాశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడమే మా ప్రథమ లక్ష్యం” అని చెప్పారు. 

మోదీని మానసికంగా ఓడించాం.. 

ప్రధాని మోదీని మానసికంగా ఓడించామని రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన కాన్ఫిడెన్స్​ను కోల్పోయారని చెప్పారు.  ‘‘దేశంలో కులగణన చేపట్టబోమని మోదీ మొదట చెప్పారు. కులగణన చేపట్టాల్సిందేనని మేం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా అందుకు మద్దతు ఇస్తున్నది. లేటరల్ ఎంట్రీ విషయంలోనూ ఇండియా కూటమి కలసికట్టుగా పోరాడింది. చివరికి కేంద్రం దాన్ని వెనక్కి తీసుకుంది” అని గుర్తుచేశారు.

రాహుల్​తో రెజ్లర్లు బజరంగ్, వినేశ్ భేటీ

రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫొగట్ బుధవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ తో భేటీ అయ్యారు. ఆ ఫొటోను కాంగ్రెస్ తన ట్విట్టర్​లో పోస్టు చేసింది. అలాగే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​తోనూ బజరంగ్, వినేశ్ సమావేశమయ్యారు. వీళ్లిద్ద రూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 

జులానా నియోజకవర్గం నుంచి ఫొగట్, బాద్లీ నియోజకవర్గం నుంచి పునియా పోటీచేసే అవకాశం ఉందని.. దీనిపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. పునియా, వినేశ్ పోటీపై గురువారానికి క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ హర్యానా ఇన్ చార్జ్ దీపక్ బబారియా చెప్పారు. కాగా, లైంగిక వేధింపులకు సంబంధించి అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్​కు వ్యతిరేకంగా వినేశ్​, పూనియా నిరసనలు చేశారు.

వయనాడ్ రిలీఫ్ కోసం నెల జీతం విరాళం రూ.2.30 లక్షలు అందజేత

కేరళలోని వయనాడ్​ బాధితుల పునరావాసం కోసం ఎంపీ రాహుల్ గాంధీ తన నెల జీతం రూ.2.30 లక్షలు విరాళంగా అందించారు. వయనాడ్ ​జిల్లాలో జులై 30న కొండచరియలు విరిగిపడి 400 మంది మరణించడం, వేలాదిమంది నిరాశ్రయులు కావడం తెలిసిందే. రాహుల్ గాంధీ గతంలో వయనాడ్‌‌‌‌ లోక్‌‌‌‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలోనే ఆయన విరాళం ప్రకటించారు. 

అలాగే, వయనాడ్ ​నిరాశ్రయులకు చేయగలిగినంత సాయం చేయాలని పిలుపునిచ్చారు. “వయనాడ్‌‌‌‌లోని మా సోదరులు, సోదరీమ ణులు తీవ్రమైన విషాదాన్ని చవిచూశారు. వారు కోలుకోవడానికి మన మద్దతు కావాలె. నా నెల జీతాన్ని విరాళంగా ఇచ్చా. భారతీయు లు అందరూ తాము చేయగలిగినదంతా అందించాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను" అని రాహుల్​ పేర్కొన్నారు.