అసెంబ్లీకి మళ్లా కేసీఆర్​ డుమ్మా.. ఫామ్​హౌస్​కే పరిమితమైన ప్రతిపక్ష నేత

అసెంబ్లీకి మళ్లా కేసీఆర్​ డుమ్మా.. ఫామ్​హౌస్​కే పరిమితమైన ప్రతిపక్ష నేత
  • పార్టీ నేతలకు దిశానిర్దేశాల వరకే సరి
  • సెక్రటేరియెట్​లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకూ దూరం
  • ప్రభుత్వం ఆహ్వానించినా స్పందించలే
  • జులై 25న బడ్జెట్​ సమావేశాల్లో పాల్గొని.. “ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతాం” అని హెచ్చరిక
  • అంతకు ముందు.. ఆ తర్వాత అసెంబ్లీలో కనిపించని బీఆర్​ఎస్​ చీఫ్​

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీకి బీఆర్​ఎస్​ చీఫ్​, ప్రతిపక్ష నేత కేసీఆర్​ మరోసారి ముఖం చాటేశారు. ఫామ్​హౌస్​కే ఆయన పరిమితమయ్యారు. సోమవారం తొలిరోజు సమావేశాలకు హాజరవుతారా లేదా అని సందేహాలుండగా.. డుమ్మా కొట్టారు. కేవలం పార్టీ నేతలకు దిశానిర్దేశాలతోనే కేసీఆర్​ సరిపెట్టారు. రాష్ట్ర ప్రజలు దు:ఖంలో ఉన్నారని, ప్రభుత్వానికి ఇక టైమ్​ ఇచ్చేది లేదంటూ ఆదివారం ఫామ్​హౌస్​లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో చెప్పిన ఆయన.. తీరా ఫస్ట్​ డే అసెంబ్లీ సమావేశాలకు అటెండ్​ కాలేదు. 

ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని.. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని.. ఏమైనా తప్పులు ఉంటే ఇరుకునపెట్టాలని సీఎం రేవంత్​రెడ్డి ఆహ్వానించినా ఆయన ఎప్పటిలెక్కనే వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16కు వాయిదా పడటంతో.. అప్పటి నుంచైనా కేసీఆర్​ వస్తారా? అనే చర్చ జరుగుతున్నది. 

ఒక్కసారి వచ్చి.. ‘చీల్చి చెండాడుతా’మని చెప్పి..!

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్​ ఎక్కువగా ఫామ్​హౌస్​లోనే ఉంటున్నారు. అసెంబ్లీ ఫలితాల అనంతరం తుంటి ఎముక విరిగాక కొన్నిరోజలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సర్జరీ కావడంతో మొదట్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు చేతికట్టె సాయంతో అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్​ చాంబర్​లో ప్రమాణం చేసి వెళ్లిపోయారు. 

జులై 25న నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో ఒక్కరోజు ఇట్ల వచ్చి అట్ల వెళ్లిపోయారు. ఆరోజు మీడియా పాయింట్​లో మాట్లాడుతూ.. “ఈ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతాం” అని హెచ్చరించి..  సభకు ఒక్క రోజు కూడా అటెండ్​ కాలేదు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. తొలిరోజు కేసీఆర్​ రాలేదు. 

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకూ గైర్హాజరు

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకూ కేసీఆర్​ హాజరుకాలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్​ఎర్రవల్లిలోని ఫామ్​హౌస్​కు వెళ్లి కేసీఆర్​ను ఆహ్వానించారు. కానీ,  సోమవారం సెక్రటేరియెట్​లో విగ్రహావిష్కరణకు ఆయన రాలేదు.