నిజాలే మాట్లాడిన.. గ్రౌండ్​ లెవల్లో జరుగుతున్నదే సభలో ప్రస్తావించా: రాహుల్​

నిజాలే మాట్లాడిన.. గ్రౌండ్​ లెవల్లో జరుగుతున్నదే సభలో ప్రస్తావించా: రాహుల్​
  • హిందూ సమాజాన్ని నేను కించపర్చలే 
  • రికార్డుల్లో కామెంట్లు తొలగించడంతో షాక్​కు గురయ్యా
  • ఇది పార్లమెంట్​ సిద్ధాంతాలకు విరుద్ధం
  • తన కామెంట్లను పునరుద్ధరించాలని స్పీకర్​కు లేఖ

న్యూఢిల్లీ: లోక్​సభలో తాను మాట్లాడింది అంతా నిజమే అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. హిందూ సమాజాన్ని తాను ఎక్కడా కించపర్చలేదని అన్నారు. నిజం మాట్లాడినా.. అవినీతిపై ప్రశ్నించినా.. కొందరికి నచ్చదని విమర్శించారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ సెషన్​కు వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు.  అలాగే,  తన స్పీచ్‌లోని కామెంట్లను రికార్డుల నుంచి తొలగించినట్లు స్పీకర్‌ ప్రకటించగా.. స్పీకర్​కు రాహుల్ ఓ లేఖ రాశారు. 

‘‘మోదీ ప్రపంచంలో వాస్తవాన్ని తొలగించగలరు. కానీ వాస్తవానికి నిజాన్ని తొలగించలేరు. లోక్​సభలో సోమవారం నేను మాట్లాడిందంతా నిజం. ఏం చెప్పాలని అనుకున్నానో.. అదంతా చెప్పాను. ఎదుటివాళ్లు ఎలా అర్థం చేసుకుంటారో.. అది వాళ్ల ఇష్టం. వాస్తవానికి నిజం అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. దాన్ని ఎవరూ తొలగించలేరు’’అని రాహుల్ పేర్కొన్నారు. ఎవరు అవునన్నా.. కాదన్నా గ్రౌండ్ లెవల్​లో ఏం జరుగుతున్నదో అదే తాను చెప్పానని వివరించారు. రికార్డుల నుంచి తన కామెంట్లు తొలగించినా.. సత్యం ఎప్పటికీ అలాగే నిలబడి ఉంటుందని చెప్పారు.

సభ్యులందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది

లోక్​సభలో తాను చేసిన కామెంట్లను రికార్డుల నుంచి స్పీకర్ ఓం బిర్లా తొలగించడం షాక్​కు గురి చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. వాటిని పునరుద్ధరించాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 (1) ప్రకారం సభ్యులందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల తరఫున వాయిస్ వినిపించే హక్కు అందరికీ ఉంటుందని తెలిపారు. తన కామెంట్లను రికార్డుల నుంచి తొలగించడం ప్రజాస్వామ్యం, పార్లమెంట్ సిద్ధాంతాలకు విరుద్ధమని తెలిపారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తమపై ఎన్నో ఆరోపణలు చేసినా.. ఆ కామెంట్లలో కేవలం ఒక పదం మాత్రమే తొలగించారని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ పక్షపాతం చూపించడమే అవుతుందని చెప్పారు. సభా కార్యకలాపాల నుంచి కొన్ని కామెంట్లను తొలగించే అధికారం సభాపతికి ఉందని, అయితే, ఈ నిబంధన కేవలం కొన్ని పదాలకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. 

నీట్​పై చర్చించాలని మోదీకి లేఖ

నీట్ వ్యవహారంపై బుధవారం చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ మంగళవారం లేఖ రాశారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించాలని ఉభయ సభల్లో సభ్యులు కోరుతున్నారని పేర్కొన్నారు. శుక్రవారం, సోమవారం అటు రాజ్యసభ, ఇటు లోక్​సభలో ప్రతిపక్షాలు నీట్​పై చర్చకు పట్టుబట్టినా తిరస్కరించారని తెలిపారు. నీట్​పై ముందుకు వెళ్లేందుకు సరైన మార్గం అవసరమని చెప్పారు. చర్చల ద్వారానే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఉభయ సభల నుంచి వారికి భరోసా ఇవ్వాలని కోరారు. ఏడేండ్లలో 70 పేపర్లు లీక్ అయ్యాయని, రెండు కోట్ల మంది స్టూడెంట్లు ప్రభావితం అయ్యారని తెలిపారు.

రాహుల్​కు బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ నోటీసులు

ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ చేసిన ప్రసంగంలో లోపాలున్నాయని పేర్కొంటూ బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ మంగళవారం లోక్‌‌‌‌‌‌‌‌సభలో నోటీసు ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాన చర్చలో భాగంగా ప్రతిపక్ష నేత రాహుల్ చేసిన కామెంట్లు అన్ని నిరాధార ఆరోపణలు అని బన్సూరి తెలిపారు. తన నోటీసును పరిగణనలోకి తీసుకోవాలని స్పీకర్​ను కోరారు. 

అయోధ్య విరాళాలు, అగ్నిపథ్ స్కీమ్​లో కాంపన్సేషన్ వంటి ఎన్నో అంశాలపై రాహుల్ అబద్ధాలు చెప్పారని ఆమె సభ దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ అండర్ డైరెక్షన్ 115 ప్రకారం.. కేంద్ర మంత్రి లేదా సభ్యులు ఎవరైనా తప్పుడు ప్రకటనలు చేస్తే ఆ అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లొచ్చు. దీనికి ముందు వాటికి సంబంధించిన ఎవిడెన్స్​ను స్పీకర్​కు అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిపై స్పీకర్ విచారించి చర్యలు తీసుకుంటారు.