పహల్గాం ఉగ్రదాడి బాధితుడితో రాహుల్ గాంధీ.. ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పిన బాధితుడు

పహల్గాం ఉగ్రదాడి బాధితుడితో రాహుల్ గాంధీ.. ఏం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పిన బాధితుడు

శ్రీనగర్: పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన నర మేధాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. శ్రీనగర్లో పర్యటించిన రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులను తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా విపక్షాల నుంచి సంపూర్ణ మద్ధతు ఉంటుందని ఆయన మరోమారు స్పష్టం చేశారు. పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దుర్మార్గమైన చర్య, అలాంటి ఆలోచన వెనుక సమాజంలో చీలిక సృష్టించి భారత్లో అంతర్గత కలహాలు రేపాలనే కుట్ర ఉందని రాహుల్ అభిప్రాయపడ్డారు.

ఈ సమయంలో భారతీయులంతా ఐకమత్యంగా ఉండాలని, ఉగ్రవాదులు చేస్తున్న ఈ ఆలోచనకు భారతీయులంతా తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. పహల్గాం ఉగ్రదాడిలో గాయపడిన వారిలో ఒకరిని స్వయంగా కలిసి పరామర్శించానని, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిని, లెఫ్టినెంట్ గవర్నర్ను కూడా కలిశానని రాహుల్ చెప్పారు.

పహల్గాంలో కేంద్ర హోం శాఖ భద్రతా వైఫల్యం, నిఘా లోపంతోనే ఉగ్రదాడి జరిగిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఇప్పటికే ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎల్లప్పుడూ మూడంచెల భద్రత ఉండే ప్రదేశంలో పర్యాటకులపై దాడి జరగడం దారుణమని పేర్కొంది.  ఈ దాడి ముమ్మాటికీ పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థల పనేనని వెల్లడించింది. టెర్రరిస్టులు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి హిందువులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడడాన్ని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.