అణగారిన ప్రజల హక్కుల నాయకుడు : సామాజిక కార్యకర్త ఎస్. శ్యామల

భారతదేశంలో వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమ పోరాటంతో పాటు కుల నిర్మూలన, సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో విశేషంగా పాల్గొన్న వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. భారత దేశ స్వరాజ్య ఉద్యమంతో పాటు తదనంతరం జరిగిన దేశ పునర్నిర్మాణంతో ముడిపడిన జగ్జీవన్ రామ్ జీవితం రాజకీయ, సామాజిక, చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నది. 1908 ఏప్రిల్ 5వ తేదీన జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లాలోని చిన్న గ్రామమైన చంద్వాలో వసంతాదేవి, శోభిరామ్ దంపతులకు జన్మించాడు. నిమ్న కులంలో పుట్టి పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు మెరుగైన విద్యార్థిగా, మేధావిగా రాణించాడు. 1922లో ఆరా పట్టణంలో పాఠశాలలో చదువుతున్నప్పుడు జగ్జీవన్ రామ్ ముట్టుకున్న కుండలో నీటిని తాగడానికి ఆధిపత్య కులాల విద్యార్థులు నిరాకరించడంతో మొదటిసారి అంటరానితనం, అణచివేతను ఎదుర్కొన్నాడు. జగ్జీవన్‌రామ్‌ కలకత్తాలో విల్లింగ్టన్‌ స్క్వేర్‌లో ముప్పై వేల మంది కార్మికులను కూడగట్టి భారీ ర్యాలీ నిర్వహించాడు. ఈ విజయంతో జగ్జీవన్‌రామ్‌ సుభాష్‌చంద్రబోస్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ వంటి చాలామంది జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటిష్‌ వలసవాద సంకెళ్లుతెంపి, దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించాలని, సామాజిక సమానత్వం సాధించాలని విద్యార్థి దశలోనే అనుకున్నాడు. 

క్వింట్​ఇండియా ఉద్యమంలో..

1934లో జగ్జీవన్‌రామ్‌ కలకత్తాలో అఖిల భారతీయ రవిదాస్‌ మహాసభను స్థాపించాడు. దళితుల సాంస్కృతిక ‘కులగురు’ అయిన ‘గురు రవిదాస్‌’ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అనేక జిల్లాల్లో రవిదాస్‌ సమ్మేళనాలను నిర్వహించాడు. సాంఘిక సంస్కరణ కోసం వ్యవసాయ కార్మిక మహాసభను, ఆలిండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ మొదలైన సంఘాలను స్థాపించాడు. ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూ, మరోవైపు సాంఘిక సంస్కరణ కోసం రాజకీయ ప్రాతినిధ్యం వహించిన గొప్ప మేధావి ఆయన. బీహారులో 1934లో వచ్చిన భయంకరమైన భూకంపం సందర్భంగా జగ్జీవన్‌రామ్‌ ప్రజలకు సహాయ, పునరావాస చర్యలు చేపడుతున్న సందర్భంలో మొదటిసారిగా గాంధీజీతో పరిచయం ఏర్పడింది.1935లో కాన్పూర్‌లో జరిగిన డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ కాన్ఫరెన్స్ కు జగ్జీవన్‌రామ్‌ అధ్యక్షత వహించాడు. దేశంలోని షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల వారి హక్కులు, అభివృద్ధికోసం జగ్జీవన్‌రామ్‌ తీవ్రంగా కృషి చేశారు. 1936లో బీహార్‌ శాసనసభలో ఎమ్మెల్యే అయ్యాడు. 1937లో బీహారు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ నుంచి14 రిజర్వుడు స్థానాలకు జగ్జీవన్‌రామ్‌ అభ్యర్థులను పోటీకి నిలిపాడు. ఆ ఎన్నికల్లో ఎటువంటి వ్యతిరేకత లేకుండా14మంది అభ్యర్థులు గెలవడంతో జగ్జీవన్‌రామ్‌ ఒక రాజకీయ నిర్ణయాత్మకశక్తిగా, కింగ్‌మేకర్‌గా ఎదిగాడు. ఈ సమయంలోనే తమతో చేతులు కలపాల్సిందిగా ‘కాంగ్రెస్ పార్టీ’ నుంచి జగ్జీవన్‌ రామ్‌కి ఆహ్వానం అందింది.1942లో జగ్జీవన్‌రామ్‌ బొంబాయిలో అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.

సంజీవయ్యను సీఎం చేయడంలో..

1946 ఆగస్టు 30న భారతదేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా బ్రిటిష్‌ వైస్రాయి ఆహ్వానించిన పన్నెండుమంది దేశ నాయకుల్లో జగ్జీవన్‌రామ్‌ ఒకరు.1946 సెప్టెంబర్‌2న ఏర్పాటు చేసిన మధ్యంతర ప్రభుత్వంలో కార్మికశాఖమంత్రిగా, అణగారిన సామాజికవర్గాలకు ఏకైక ప్రతినిధిగాను జగ్జీవన్‌రామ్‌ ఉన్నాడు. ముప్పైమూడేళ్లకు పైగా కేంద్ర కేబినెట్‌ మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగా డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాలు దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. మొరార్జీదేశాయ్‌ ప్రధానిగా కేంద్రంలో జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు జగ్జీవన్‌రామ్‌ కేంద్ర రక్షణశాఖామంత్రిగా విధులు నిర్వహించారు.అప్పుడు బంగ్లాదేశ్ యుద్ధంలో గెలుపొందే విధంగా కృషి చేశాడు. దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చేయడంలోనూ కీలకపాత్ర నిర్వహించారు.1950లో సికింద్రాబాద్‌ లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. 1986 జులై 6వ తేదీన ఆయన భౌతికంగా ఈ లోకాన్ని వీడారు. ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకోగల నాయకుడు, సామాజిక, రాజకీయ బానిసత్వాలపై జీవితాంతం యుద్ధం చేసిన బాబూజీ ఎప్పటికీ స్ఫూర్తిదాత. 

- ఎస్. శ్యామల, సామాజిక కార్యకర్త