- బేస్ క్యాంపులపై దాడుల సూత్రధారిగా నిఘావర్గాల గుర్తింపు
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని పామేడు, ధర్మారం, టేకులగూడ బేస్ క్యాంపులపై ఇటీవల గెరిల్లాదాడుల వెనుక ఉన్న మావోయిస్టు మాస్టర్ మైండ్ బార్సే దేవా అని బస్తర్ పోలీసులు ప్రకటించారు. అతని ఫొటోను రిలీజ్ చేశారు. హిడ్మా స్థానంలో మావోయిస్టు బెటాలియన్ 1 కమాండర్‌గా దేవాను మావోయిస్టు పార్టీ నియమించింది. హిడ్మాను ఏడాది కింద కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమించారు. దేవా అలియాస్ సుక్కా, దేవన్న దక్షిణ బస్తర్ జోనల్బ్యూరో, దర్బా డివిజన్ సెక్రటరీగా పనిచేశారు. మెరుపు దాడులు చేయడంలో ఆయన హిడ్మా దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నట్టు చెబుతున్నారు.
42 ఏళ్ల దేవన్నది దంతెవాడ జిల్లా లోని కకాడీ గ్రామం. ఎనిమిదేండ్లకే మావోయిస్టు ఉద్యమంలో చేరాడు. గెరిల్లా యుద్దరీతిలో హిడ్మాకు దీటైన లీడర్‌గా పార్టీలో పేరుంది. దేవాకు చదవడం,రాయడం రాకపోయినా అన్ని భాషలపై పట్టుంది. దేశీ బాంబులు, యూజీబీఎల్ ఆయుధాలు తయారు చేయడంలో నేర్పరి. అతని దగ్గర ఏకె-47తో పాటు ల్యాప్‌టాప్, వాకీటాకీ ఉన్నాయని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మహేంద్ర కర్మతో పాటు పలువురు కాంగ్రెస్ లీడర్లను హతమార్చిన ఘటనలో, అరణ్‌పూర్‌లో 10 మందిని హతమార్చిన ఘటనలో ప్రధాన నిందితుడైన దేవాపై రూ.25లక్షల రివార్డు ఉందన్నారు.
ఇటీవల బీజాపూర్, సుక్మా, దంతెవాడ అడవుల్లో బేస్క్యాంపులపై దాడులు, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో భారీ సొరంగాలు,బంకర్లు గుర్తించడంతో నిఘా వర్గాలు అలర్టయ్యాయి. ఈ వ్యూహాల వెనుక ఉన్నది బార్సే దేవా అని తేలింది. దేవా కుటుంబ సభ్యులను హిడ్మా స్వగ్రామం పువ్వర్తికి తరలించారని బస్తర్ పోలీసులు చెబుతున్నారు. కాగా దేవా కోసం గాలింపు ముమ్మరం చేసినట్లుగా బస్తర్ ఐజీ సుందర్రాజ్తెలిపారు.