బీజేపీ టికెట్​ కోసం పోటాపోటీ.. బరిలో దిగేందుకు లీడర్ల ఆసక్తి

  • ఎల్లారెడ్డిలో ముఖ్యనేతలు అప్లయ్​ చేయకపోవడంపై చర్చ
  • ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను తట్టుకునే వారి కోసం సమాలోచనలు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు లీడర్లు పోటీ పడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థులను బరిలో దించేలా ముఖ్యనేతలు సమాలోచనలు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్లికేషన్ల స్ర్కూట్నీ, అభ్యర్థుల సెలక్షన్​కు సంబంధించి ఎలాంటి ప్రక్రియ షూరూ కాకముందే కొందరు లీడర్లు ఒకడుగు ముందుకేసి పార్టీ ముఖ్య నేతలను కలుస్తూ, తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

 ఆయా నియోజకవర్గాల పరిస్థితులు, పార్టీ తరఫున, ప్రజల తరఫున పోరాటాలు, ఆయా సామాజికవర్గాల ఓట్లు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల బలాబలాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాత్రం ముఖ్యనేతలు టికెట్ కోసం అప్లయ్​చేయకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 

సీఎంపై పోటీకి సై..

కామారెడ్డిలో కేసీఆర్​పై బీజేపీ తరఫున పోటీకి పలువురు నేతలు సై అంటున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఉప్పునూతుల మురళీధర్​గౌడ్, ఎంజీ వేణుగోపాల్​గౌడ్,  డాక్టర్​ఇట్టం సిద్ధరాములు, జూలూరి సుధాకర్, నీలం చిన్నరాజులు, చైతన్యగౌడ్​ అప్లికేషన్లు అందజేశారు. కొన్నాళ్లుగా ప్రజల పక్షాన వివిధ అంశాలపై ఉద్యమాలు చేపట్టడం, వాటిలో కొన్ని రాష్ట్రస్థాయిలో చర్చనీయంశం కావడంతో తనకే టికెట్​ వస్తుందనే వెంకటరమణారెడ్డి ధీమాతో ఉన్నారు. ఈయన గత ఎన్నికల్లో పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటిచేసి, ఓడిపోయిన ఇట్టం సిద్ధరాములు ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సీనియర్​ నేతలు మురళీధర్​గౌడ్, వేణుగోపాల్​గౌడ్​కూడా పార్టీ తమకే పోటీకి అవకాశం వస్తుందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్​పోటీ చేస్తున్నందున ఈయనపై పార్టీ ఎవరిని పోటీకి నిలుపుతుందనే ఆసక్తి నెలకొంది.

ఎల్లారెడ్డిలో ఆ నేతలు అప్లికేషన్లు పెట్టలే 

ఎల్లారెడ్డి నుంచి కమలం గుర్తుపై పోటీకి మర్రి బాపురెడ్డి, పైళ్ల కృష్ణారెడ్డి, బైండ్ల పోచయ్య, చైతన్యగౌడ్, దేవేందర్, బాలరాజు, అశోక్​కుమార్, నరేశ్, బాలకిషన్, వెంకన్న అర్జీలు సమర్పించారు. ఇక్కడి నుంచి ఈ సారి బరిలో ఉంటారని భావించిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, గత ఎన్నికల్లో పోటీచేసిన పార్టీ జిల్లా మాజీ ప్రెసిడెంట్ ​బాణాల లక్ష్మారెడ్డి టికెట్ ​కోసం అప్లికేషన్​ పెట్టకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరఫున పోటీ చేసి ఓడిన ఏనుగు రవీందర్​రెడ్డి తర్వాత కొన్నాళ్లకు ఈటెల రాజేందర్​తో కలిసి బీజేపీలో చేరారు. పార్టీ మారిన కొత్తలో చురుకుగా వ్యవహరించిన ఏనుగు, ఇటీవల ప్రోగ్రామ్స్​కు దూరంగా ఉంటున్నారు. పోటీకి ఈయన అప్లికేషన్​ కూడా పెట్టలేదు.

జుక్కల్​లో మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో ముగ్గురు

జుక్కల్​నుంచి పోటీకి పార్టీ జిల్లా ప్రెసిడెంట్,​ మాజీ ఎమ్మెల్యే అరుణతారతో పాటు నాయుడు ప్రకాశ్, రేవన్, ఎన్ఆర్ఐ​ బుచ్చయ్య అప్లికేషన్​ పెట్టారు. 2018 ఎన్నికల టైమ్​లో బీజేపీలో చేరిన అరుణతార, పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పట్టు పెంచుకున్నారు. నిరుడు ఆగస్టులో 12 రోజుల పాటు పార్టీ తరఫున పల్లె గోస బీజేపీ భరోసా ప్రోగ్రామ్​నిర్వహించారు. ప్రతీ గ్రామాన్ని విజిట్​చేశారు. స్థానిక సమస్యలపై ఆందోళనలు నిర్వహించారు. తమకు అవకాశం ఇవ్వాలని సీనియర్ లీడర్లు నాయుడు ప్రకాశ్, రేవన్ కోరుతున్నారు. ఈసారి కొత్తగా నుంచి ఎన్ఆర్ఐ బుచ్చయ్య ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. 

బాన్సువాడలో అత్యధికంగా..

బాన్సువాడ నుంచి పోటీ చేసేందుకు అత్యధికంగా 12 మంది అప్లయ్​చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి మల్యాద్రిరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి మాధవ్​యాదవ్​, లీడర్లు దొరబాబు, లక్ష్మీనారాయణ, సాయిరెడ్డి,  శ్రీనివాస్​గార్గె, జగన్మోహన్​రెడ్డి, సుగుణ, గంగాధర్, శివప్ప,​ కూనీటి రాములు, డాకయ్య అప్లికేషన్​ పెట్టిన వారిలో ఉన్నారు. ఇందులో ఇద్దరు లీడర్లు మినహా మిగతా వాళ్లంతా ద్వితీయ శ్రేణి లీడర్లు. కాంగ్రెస్​ నుంచి 3 ఏండ్ల కింద బీజేపీలో చేరిన మల్యాద్రిరెడ్డి, స్థానికంగా పార్టీ ప్రోగ్రామ్స్, ప్రజా ఆందోళనలు చేపట్టారు. ఇక్కడ ప్రస్తుతం స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో  బీఆర్ఎస్​ తరఫున ఈయనే పోటీచేయనున్నారు. స్పీకర్​ను ఎదుర్కొనేందుకు బీజేపీ నుంచి బలమైన నేతను బరిలో నిలిపే అవకాశమున్నట్లు పార్టీవర్గాలు  తెలిపాయి.