నిరుద్యోగుల తిండికి లీడర్ల ఆరాటం.. పోటాపోటీగా అన్నదానాలు, అంబలి కేంద్రాలు

  • నిరుద్యోగుల తిండికి లీడర్ల ఆరాటం
  • మంచిర్యాల లైబ్రరీలో లంచ్ ఏర్పాటుకు  బీఆర్ఎస్​, కాంగ్రెస్ నేతల ​లొల్లి
  •     మాజీ ఎమ్మెల్సీ లంచ్​ ఏర్పాట్లను అడ్డుకున్న ఎమ్మెల్యే
  •     సొంత పైసలు కాకుండా రూ.15 లక్షల మున్సిపల్ నిధుల కేటాయింపు
  •     చివరికి స్నాక్స్​తో సరిపెడుతున్న ప్రేమ్​సాగర్​ వర్గీయులు
  •     నియోజకవర్గంలో పోటాపోటీగా అన్నదానాలు, అంబలి కేంద్రాలు

మంచిర్యాల,వెలుగు:  మంచిర్యాల లైబ్రరీలో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఉన్నట్టుండి మంచి రోజులొచ్చాయి. రాబోయే ఎన్నికల పుణ్యమా అని వారికి లంచ్​, స్నాక్స్​ పెట్టేందుకు లీడర్లు పోటీ పడ్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ విషయంలో లోకల్​ బీఆర్ఎస్​ ఎమ్మెల్యే దివాకర్​రావు వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.  ఫ్రీగా ఫుడ్​ పెడ్తామని వచ్చిన కాంగ్రెస్ మాజీ  ఎమ్మెల్సీ ప్రేమ్​సాగర్​రావును అడ్డుకున్న ఎమ్మెల్యే,  తన సొంత పైసలు కాకుండా మున్సిపల్​ నిధులను కేటాయించడం వివాదాస్పదమైంది. 
మొత్తం మీద మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు పొలిటికల్​ లీడర్లు చేస్తున్న గిమ్మిక్కులను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ లంచ్​ పంచాయితీ..

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీ లీడర్ల దృష్టి జిల్లా లైబ్రరీలో పోటీపరీక్షలకు ప్రిపేర్​అవుతున్న నిరుద్యోగులపై పడింది. కొన్నేండ్ల నుంచి వందలాది మంది నిరుద్యోగులు ఇక్కడ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. రద్దీ పెరగడంతో కూర్చోవడానికి సీట్లు దొరక్క చాలామంది లైబ్రరీ తెరువక ముందే పొద్దుట ఆరింటికే వచ్చి క్యూ కడుతున్నారు. మార్నింగ్ ​బ్రేక్​ఫాస్ట్​ చేయకుండానే ఖాళీ కడుపులతో వచ్చి సాయంత్రం ఏడింటి వరకు చదువుకుంటున్నారు. కొంతమంది మధ్యాహ్నానికి లంచ్ ​బాక్స్ ​తెచ్చుకుంటుండగా, మరికొందరు హోటళ్లలో తింటున్నారు. దాదాపు మూడేండ్లుగా ఇదే పరిస్థితి. ఇంతకాలం వారిని పట్టించుకున్న నాథుడే లేడు. ఇప్పుడు ఎలక్షన్  సీజన్ ​కావడంతో అకస్మాత్తుగా అన్ని పార్టీలకు నిరుద్యోగుల ఆకలి తీర్చాలనే ఆరాటం మొదలైంది. ​ఈ క్రమంలో మొదట కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్​ఆధ్వర్యంలో ఏఐసీసీ మెంబర్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్​సాగర్​రావు లైబ్రరీకి వచ్చే నిరుద్యోగులకు మధ్యాహ్నభోజనం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

దీంతో కాంగ్రెస్ ​పార్టీకి ఎక్కడ క్రెడిట్​ వస్తుందోనని భావించిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు రంగంలోకి దిగారు.  ప్రేమ్​సాగర్ ​రావు లంచ్​ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దంటూ లైబ్రరీ ఆఫీసర్లను  ఆదేశించారు. ఈలోగా తనకు పైసా ఖర్చులేకుండా రాబోయే మూడు నెలల పాటు మధ్యాహ్నభోజనం ఏర్పాటుకు అవసరమైన రూ.15 లక్షల మున్సిపల్​ నిధులు కేటాయించారు. ఇటీవల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కాగా, అదేరోజు రఘుపతిరావు ట్రస్ట్​ ఆధ్వర్యంలో డీసీసీ చైర్​పర్సన్​ కొక్కిరాల సురేఖ సైతం అన్నదానానికి సిద్ధమయ్యారు. లైబ్రరీ ఆవరణలో అన్నదానం చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పక్కనున్న గాంధీ పార్కులో ప్రారంభించారు. ఇలా పోటాపోటీగా మధ్యాహ్నభోజనం వడ్డించడంతో ఇటు తినాలా, అటు తినాలా అని నిరుద్యోగులు అయోమయానికి గురయ్యారు. ఆ మరునాడే కాంగ్రెస్​అన్నదానం చేయకుండా అధికార పార్టీ లీడర్లు గాంధీ పార్కుకు తాళం వేయించారు. దీంతో రెండు పార్టీల నడుమ మధ్యాహ్న భోజనం రచ్చ మొదలైంది. చివరకు ప్రేమ్​సాగర్​రావు ఈవెనింగ్​ స్నాక్స్ వితరణతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

పోటాపోటీగా అంబలి కేంద్రాలు..

మంచిర్యాల నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు పోటాపోటాగా అంబలి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు కొన్నేండ్లుగా ఎండకాలంలో మంచిర్యాల ఐబీ, సీసీసీ, లక్సెట్టిపేటలో 'దివాకరన్న పెరుగన్నం' పెడుతున్నారు. దానిని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్​సాగర్​ రావు అంబలి పంపిణీ చేస్తున్నారు. ఇదే కోవలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు మంచిర్యాల ఐబీ, సీసీసీ, శ్రీరాంపూర్​ బస్టాండ్, లక్సెట్టిపేట ఊత్కూర్​చౌరస్తా, కరీంనగర్ చౌరస్తాల్లో అంబలి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మంచిర్యాల బీఆర్ఎస్ టికెట్​ రేసులో దివాకర్​రావుతో పోటీ పడుతున్న ఫిల్మ్​ డెవలప్​మెంట్ కార్పొరేషన్​మాజీ చైర్మన్ పూస్కూరి రామ్మోహన్​రావు నేను సైతం అంటూ అంబలి పంపిణీ కేంద్రాలు ప్రారంభించారు. అన్ని పార్టీల లీడర్లు మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేటలోని మెయిన్ చౌరస్తాలలో పక్కపక్కనే అంబలి కేంద్రాలు పెట్టి జనాలను ఆకట్టుకునేందుకు తిప్పలు పడుతున్నారు. 

.మార్నింగ్​ బ్రేక్​ ఫాస్ట్​ పెట్టాలె..

లీడర్ల రాజకీయం పుణ్యమాని నిరుద్యోగులకు మధ్యాహ్నం లంచ్, ఈవెనింగ్​ స్నాక్స్​అందుతున్నా మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​ కరువైంది. ప్రస్తుతం దాదాపు 250 మందికి పైగా నిరుద్యోగులు జిల్లా లైబ్రరీలో ప్రిపేర్​అవుతున్నారు. రద్దీ పెరగడంతో ఫస్ట్​ వచ్చిన వాళ్లకే సీటు దొరుకుతోంది. లేట్​ అయితే బయట కూర్చొని చదువుకోవాల్సిందే. దీంతో చాలామంది పొద్దుట ఆరింటి నుంచే క్యూ కడుతున్నారు. మంచిర్యాల టౌన్​నుంచే కాకుండా జిల్లాలోని దూరప్రాంతాల నుంచి చాలామంది బ్రేక్​ఫాస్ట్ ​చేయకుండానే వస్తున్నారు. హోటళ్లలో టిఫిన్ చేయాలంటే రోజుకు కనీసం రూ.50 ఖర్చవుతుంది. పేద కుటుంబాలకు చెందినవారు లంచ్​టైమ్​వరకు ఖాళీ కడుపులతోనే చదువుకుంటున్నారు. దాతలు స్పందించి మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.