అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం లీడర్ల యాగాలు

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం లీడర్ల యాగాలు

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ లీడర్లు, టికెట్ల కోసం కాంగ్రెస్ ఆశావహులు పూజలు, యాగాలు మొదలుపెట్టారు. అధిష్టానం దయతో పాటు భగవంతుడి ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్వామి వారిని ప్రసన్నం చేసుకుని.. ఎన్నికల్లో గెలువొచ్చని భావిస్తున్నారు. ఈ సారి తనను గెలిపించు సామీ అంటూ.. గుడుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏ యాగం చేస్తే గెలుస్తం.. ఏ పూజ చేస్తే పార్టీ పెద్దల మనస్సు మారి టికెట్​కు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందో అలాంటి పంతుళ్లను తీసుకొచ్చి మరీ తంతు పూర్తి చేసుకుంటున్నారు. లీడర్ల వెంట తిరిగేవాళ్లు ఇదంతా చూసి విసిగెత్తిపోతున్నారంట. యాగాలు, పూజల పేర్లతో చాలా ఇబ్బంది పెడ్తున్నారంటూ బహిరంగంగానే వాపోతున్నారు. బీఆర్ఎస్ టికెట్లు అనౌన్స్ చేయకముందు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామంది పూజలు, యాగాలు చేశారు. ఇప్పుడు గెలుపు కోసం కొందరు యాగాలు, పూజలకు సిద్ధమవుతుంటే.. మరికొందరు ఈ తంతు పూర్తి చేసేశారు.

పెద్ద పంతుళ్లు కావాలె.. సీఎంకు తెల్వాలే

దేవుడా.. ఓ మంచి దేవుడా.. నేను మళ్లీ గెలవాలి అంటూ కొందరు.. ఈ సారి కూడా టికెట్ నాకే దక్కాలి.. నేనే గెలవాలని మరికొందరు.. ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్లు యాగాలు, హోమాలు, పూజలు, వ్రతాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజశ్యామల యాగంతో పాటు సుదర్శన యాగాలు కూడా చేస్తున్నారు. పూజలు అంటే సీఎంకు ఇష్టమని.. ఇవి కాస్త ఆయన దృష్టిలో పడితే ఇంకింత బాగుంటుందని.. ఎలాగైనా సీఎం చెవిలో పడేలా ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అభ్యర్థులను ప్రకటించడమే ఆలస్యం.. టికెట్ వచ్చిన వారి నుండి రాని వాళ్లతో సహా అందరు దైవత్వంలోకి వెళ్లిపోయారు. 

తాండూర్ లో గెలుపు కోసం అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాకు చెందిన మంత్రి, పరకాల, రామగుండం ఎమ్మెల్యేలు ఇలా ఒకరి తర్వాత ఒకరు స్పెషల్ పూజలు, యాగాలు చేయిస్తున్నారు. తమ అనుకూల దైవాలను దర్శించుకుంటున్నారు. ఇక టికెట్ కోసం జనగామ, స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యేలు పూజలు చేయించినట్లు తెలిసింది. ఇదే బాటలో కాంగ్రెస్​ లీడర్లు తమపై ఏ దోషం ఉన్నా పోవాలంటూ యాగాలకు రెడీ అయ్యారు. ఇప్పటికే గతంలో ఓడిపోయిన కొందరు లీడర్లు.. స్థానాలు మార్చుకుని వేరే నియోజకవర్గాల్లో టికెట్ వచ్చేలా పూజలు చేయించుకున్నారు. టికెట్​కు ఇబ్బంది లేకుండా గెలుపు అవకాశాలు మెరుగుపడాలని ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద పంతుళ్లను తీసుకొచ్చి యాగాలు చేస్తూ రాజుల కాలన్ని గుర్తు చేస్తున్నారు.