భద్రాచలంలో డబుల్​బెడ్​రూం ఇళ్లు తమ వాళ్లకే ఇవ్వాలని లీడర్ల ఒత్తిడి

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో అధికార పార్టీ లీడర్లతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆయన అనుచరవర్గం డబుల్​బెడ్​రూం ఇళ్లు తమ వాళ్లకే ఇవ్వాలని రెవెన్యూ ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వారికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. మరోవైపు అధికార పార్టీలోనే ఒక్కో నేత ఒక్కో సిఫార్స్ చేస్తున్నారు. ఉన్నవి 250 డబుల్​బెడ్ రూం ఇళ్లు. వీటిలో నిర్మాణం పూర్తి చేసుకున్నవి 117 మాత్రమే. మిగిలిన 133 నిర్మాణంలో ఉన్నాయి. వీటి కోసం 2018 నుంచి వేలమంది దరఖాస్తులు పెట్టుకున్నారు. 2వేల అప్లికేషన్లు తహసీల్​కార్యాలయంలో ఉన్నాయి. భద్రాచలంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఎంపిక ప్రక్రియ ఆయన కనుసన్నల్లోనే జరగాలి. అధికారం మాది, మేమిచ్చిన లిస్టు ప్రకారం ఇవ్వాలంటూ బీఆర్​ఎస్​ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విప్​, మినిస్టర్​పేరుతో లిస్టులు ఇస్తున్నారు. గతంలో 250 ఇళ్లు తొలిదశలో కనీసం డ్రా కూడా తీయకుండానే బెనిఫిషర్లను ఎంపిక చేసి వివిధ పార్టీల, సంఘాల లీడర్లు పంచుకున్నారు. తిరిగి ఇప్పుడు కూడా ఇదే తరహాలో కేటాయించాలని కోరుతున్నారు. అయితే రెవెన్యూ ఆఫీసర్లు మాత్రం గిరిజనుల దరఖాస్తులను మాత్రమే పరిశీలించి, విచారిస్తున్నారు. కూలి పనులకు వెళ్తూ, ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నవారినే ఎంపిక చేసుకున్నారు. నిర్మాణం పూర్తయిన 117 ఇళ్లను పంపిణీ చేయాలని వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

కాపలా కాయలేకపోతున్నం...

డబుల్​బెడ్​రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిన కాంట్రాక్టర్లు వాటికి కాపలా కాయలేక ఇబ్బందులు పడుతున్నారు. రెండో దశలో 250 డబుల్ బెడ్​రూం ఇళ్లు మంజూరైతే 117 పూర్తయ్యాయి. మరో 133 ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. జనవరి 2న ఇళ్లు పంపిణీ చేస్తామని త్వరగా పూర్తి చేయాలంటూ కాంట్రాక్టర్లను ఉరుకులు పరుగులు పెట్టించారు. దీంతో 117 ఇళ్లు పూర్తి చేశారు. వీటిని తీసుకోవాలని ఐటీడీఏ ట్రైబల్ ఇంజనీరింగ్​ఆఫీసర్లను కాంట్రాక్టర్లు వేడుకుంటున్నారు. వాటిలో ఎలక్ట్రికల్ వైరింగ్, లైట్లు, మంచినీటి ట్యాప్ లు ఏర్పాటు చేశారు. వీటిని దొంగల బారి నుంచి కాపాడేందుకు కాంట్రాక్టర్లే కాపలాగా కొందరిని ఉంచారు. వారికి నెలనెలా జీతాలు ఇచ్చుకుంటున్నారు. హ్యాండోవర్​ చేసుకుంటే తమకు భారం తప్పుతుందంటున్నారు.

ఐటీడీఏ పరిధిలో ఇదీ పరిస్థితి..!

భద్రాచలం ఐటీడీఏలోని ట్రైబల్ ఇంజనీరింగ్ విభాగం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టింది. భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో వీరు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 4563 ఇళ్లు మంజూరైతే 2737 మాత్రమే పూర్తయ్యాయి. 1080 నిర్మాణ దశలో ఉన్నాయి. 515 ఇళ్లు స్థల సమస్య, భూ వివాదాలతో టెండర్లు కూడా జరగలేదు. 


డబుల్​బెడ్ రూం ఇళ్ల పంచాయితీ తీవ్రస్థాయికి చేరుకుంది. నిర్మాణం పూర్తయిన ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని కాంట్రాక్టర్లు, వాటిని మాకంటే మాకు పంచాలని అధికార, ప్రతిపక్ష పార్టీల వారు రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ఫలితంగా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

డ్రా తీసి పంచాలి...

జనవరి 2, సంక్రాంతి ఇలా రెండుసార్లు డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేస్తామని ముహూర్తాలు ఖరారు చేశారు. కానీ నేటికీ ఇవ్వలే. గతంలో కాకుండా ఈసారి బెనిఫిషర్ల లిస్టు ఫైనల్ చేసి డ్రా ద్వారా ఎంపిక చేయాలి.
‌‌‌‌- సునీల్, సీపీఐ టౌన్​ సెక్రటరీ, భద్రాచలం

స్పీడప్​ చేశాం...

డబుల్ బెడ్​రూం ఇళ్ల నిర్మాణాలు స్పీడప్​చేశాం. నిర్మాణాలు మాత్రమే మా బాధ్యత. పంపిణీ అంతా రెవిన్యూదే. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోల ఆదేశాల మేరకు పనులు వేగవంతం చేశాం. త్వరలోనే పూర్తవుతాయి.
- తానాజీ, ఈఈ, ట్రైబల్ వెల్ఫేర్​