లీడర్లూ టెస్టులు చేయించుకోండి క్యాంపుకెళ్లాలె

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక దృష్ట్యా టీఆర్ఎస్ ముందుచూపు

కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ పోలింగ్ ఈ నెల 9న జరగనున్న నేపథ్యంలో  క్యాంపు రాజకీయాలకు తెర లేస్తోంది.  ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీ, సీఎం బిడ్డ  కె. కవిత పోటీలో ఉన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓటర్లను ఈ నెల 3న క్యాంపునకు తరలించేందుకు సన్నద్ధమవుతున్నారు.  క్యాంపు కోసం సిద్ధంగా ఉండాలని  ఓటర్లకు కూడా సమాచారమిచ్చారు. కరోనా రూల్స్​కు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలనే ఆదేశాలున్నాయి. పోలింగ్​కు ముందు ఓటర్లు కరోనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంది. అయితే అధికార పార్టీకి చెందినవారు క్యాంపునకు వెళ్లాల్సి ఉన్నందున  ముందుగానే టెస్టులు చేయించుకుని  సిద్ధంగా ఉండాలని పార్టీ ముఖ్యులు సూచించినట్లు సమాచారం. దీంతో బుధ, గురువారాల్లో  ఉమ్మడి నిజామాబాద్​జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కరోనా టెస్టులు చేయించుకున్నారు.  మహిళా ప్రజాప్రతినిధులతోపాటు, వారి భర్త, కొడుకులు సైతం టెస్టులు చేయించుకున్నారు. మిగిలినవారు శుక్రవారం టెస్టులు చేయించుకునే అవకాశముంది.  క్యాంపునకు వెళ్లేందుకు సన్నద్ధమైన కామారెడ్డి జిల్లాలోని కొందరు ప్రతినిధులకు కరోనా పాజిటివ్​గా కన్ఫార్మ్ అయ్యింది. వారంతా హోమ్​ఐసోలేషన్​లో ఉండనున్నారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్

నిజామాబాద్ లోకల్ బాడీ ఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఉన్న భూపతిరెడ్డి 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ మారారు. ఆయనపై 2019లో అనర్హత వేటు  పడింది. 2022 జనవరి 4 వరకు పదవీ కాలం ఉన్న ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 7న పోలింగ్ జరగాల్సి ఉండగా లాక్​డౌన్ నేపథ్యంలో వాయిదా వేశారు. ఈ నెల 9న పోలింగ్, 12న కౌంటింగ్​కు ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలిచ్చింది.  కె.కవిత(టీఆర్ఎస్), లక్ష్మీనారాయణ(బీజేపీ), వడ్డేపల్లి సుభాష్​రెడ్డి(కాంగ్రెస్) పోటీలో ఉన్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారు.  టీఆర్ఎస్ తరఫున 494, కాంగ్రెస్ 140, బీజేపీ 84, ఎంఐఎం 28,  ఇతరులు 66 మంది, ఎక్స్​అఫిషియో సభ్యులు 12 మంది ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కొందరు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇప్పటికే కారెక్కారు. అభివృద్ధి పనులకు ఫండ్స్, ఇతరత్రా సహాయ సహాకారాలు అందిస్తామనే హామీతో పలువురు పార్టీ మారుతున్నారు. స్వయంగా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు వారితో చర్చలు జరుపుతున్నారు.

3 నుంచి టీఆర్ఎస్​ లీడర్ల క్యాంప్​

మెజార్టీ ఓట్లతో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ తమ పార్టీ ఓటర్లను ముందు జాగ్రత్తగా  క్యాంపునకు తరలించేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపారు. ఉమ్మడి జిల్లాతో 9 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలంతా అధికార పార్టీకి చెందినవారే. ఓట్లు క్రాస్ కాకుండా ఉండేందుకు వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఈ నెల 3న క్యాంపునకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ ప్రతినిధులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఉండేందుకు  మండల, మున్సిపాలిటీల వారీగా లీడర్లకు బాధ్యతలు అప్పజెప్పారు. నియోజక వర్గాల వారీగా స్పెషల్​గా బస్సులు ఏర్పాటు చేసి వారిని తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. ఎక్కడికి తీసుకెళ్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. గురువారమే క్యాంపునకు తరలివెళ్లాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల శనివారానికి మార్చారు. మహిళ ప్రజాప్రతినిధులను మాత్రం పోలింగ్​కు రెండు రోజుల ముందు క్యాంపునకు తరలించేలా సంకేతాలు ఇచ్చారు. ముందుగా వారి తరఫున ఫ్యామిలీ మెంబర్లు వెళ్లనున్నారు. క్యాంపుల నుంచి పోలింగ్ రోజున నేరుగా కేంద్రాలకు రానున్నారు.

For More News..

సర్పంచ్​ను వేదికపైకి పిలిస్తే ఇద్దరొచ్చిన్రు

గాంధీయిజం.. ఓ ఇన్‌స్పిరేషన్.. నేడు గాంధీ 151వ జయంతి

మనది మార్పును వ్యతిరేకించే దేశం.. అందుకే బిల్లులపై ఇంత గొడవ