ఓట్ల కోసం కొత్త ఎత్తులు..జాబ్​మేళాలు, డ్రైవింగ్​ లైసెన్సులతో యువతకు గాలం

  •     ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు
  •     పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే మేళాలు నిర్వహించిన బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు

కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో యువత, నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు అధికార బీఆర్ఎస్​ పార్టీ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. నియోజకవర్గాల్లో జాబ్​మేళాలు, డ్రైవింగ్​ లైసెన్స్ ​మేళాల నిర్వహిస్తూ వారి ఓట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో జాబ్​మేళాలు పూర్తయ్యాయి. రెండు నియోజకవర్గాల్లో ఫ్రీ డ్రైవింగ్​ లైసెన్స్​ల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు.

నిరుద్యోగులు, యువతలో తమపై ఉన్న వ్యతిరేకతను దూరం చేసుకోవడంతో పాటు, ప్రతిపక్ష పార్టీల వైపు వారి దృష్టి మరలకుండా కట్టడి చేయడానికే మేళాలు నిర్వహిస్తున్నారనే చర్చ సాగుతోంది.

యువ ఓటర్లే కీలకం..

కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాలో మొత్తం 19,24,179 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 18 నుంచి 39 ఏండ్ల మధ్య ఉన్నవారి సంఖ్య 9,34,975. దాదాపు సగం మంది వరకు 39 ఏండ్ల లోపు వారే.  ఆయా పార్టీల గెలుపు ఓటముల్లో యువత ముఖ్యం కానున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్​జిల్లాలోని అధికార  బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు యువతను ఆకర్షించేందుకు జాబ్​మేళాలు నిర్వహిస్తున్నారు. డ్రైవింగ్​ లైసెన్సులు ఇప్పిస్తామంటూ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఈ  నెల రోజుల వ్యవధిలోనే 20 రోజుల వ్యవధిలోనే కామారెడ్డి, జుక్కల్,​ బోధన్, నిజామాబాద్​అర్బన్​ నియోజకవర్గాల్లో జాబ్​​ మేళాలు పూర్తి చేశారు. మిగతా నియోజకవర్గాల్లోనూ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో డ్రైవింగ్​ లైసెన్స్​ల జారీ కోసం అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. జాబ్​మేళాలు, డ్రైవింగ్ ​లైసెన్సుల జారీ ప్రక్రియ మొత్తం స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నా, తమ ఫ్యామిలీ మెంబర్స్, పార్టీలోని ముఖ్య లీడర్లను ముందు పెట్టి  మేళాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ​యూత్​ వింగ్​కు ఎక్కువగా భాగస్వామ్యం కల్పిస్తున్నారు. గ్రామాలు, టౌన్​లలో ప్రజాప్రతినిధులు, లీడర్ల ద్వారా బాగా ప్రచారం కల్పిస్తున్నారు. ప్రతీ మండల కేంద్రం, టౌన్లలో ఆర్భాటంగా  పోస్టర్ల ఆవిష్కరణ, వాల్ ​పోస్టర్లను అతికించడం లాంటివి చేస్తున్నారు.

కామారెడ్డిలో..

కామారెడ్డి నియోజకవర్గ నిరుద్యోగుల కోసం ఈ నెల 23న జాబ్​మేళా నిర్వహించారు. 60 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్సెస్సీ నుంచి బీటెక్​చదివిన వారు సుమారు 1200 మంది హాజరయ్యారు. ఇందులో 400 మంది వివిధ ఉద్యోగాలకు సెలక్టయ్యారు. ప్రోగ్రామ్​ ముగింపులో విప్​ గంప గోవర్ధన్​పాల్గొని పత్రాలు అందించారు. పనిలోపనిగా పార్టీ ప్రచారం చేసుకున్నారు.

నిజామాబాద్​లో..

ఈనెల 21న నిజామాబాద్​ టౌన్​లో జాబ్​మేళా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్​ గుప్తా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత నిరుద్యోగులతో ఫొటో దిగి సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు. 20 రోజుల క్రితం బోధన్, జుక్కల్​ నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు షకీల్, హన్మంత్​షిందే జాబ్​మేళాలు నిర్వహించారు.

ఫ్రీ డ్రైవింగ్​ లైసెన్స్​లు..

బాల్కొండ, ఆర్మూర్​ నియోజకవర్గాల్లో యువతకు ఉచితంగా డ్రైవింగ్​లైసెన్స్​లు ఇప్పించేందుకు మేళాలు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్​లో ఎమ్మెల్యే జీవన్​రెడ్డి 4 రోజుల కిందట ఈ ప్రోగ్రామ్​ చేపట్టారు. ఈ నెల 25 నుంచి బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్​రెడ్డి నిర్వహిస్తున్నారు.  ఆయా మండలాల్లో ఫ్రీ డ్రైవింగ్​ లైసెన్స్​ల కోసం 2,500 అప్లికేషన్లు వచ్చాయి.